కోర్టులు, చట్టాలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. వారాహి డిక్లరేషన్‌‌ విడుదల, ముఖ్యాంశాలివే!

Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వారాహి డిక్లరేషన్‌ను ప్రకటించారు. దేశంలో సనాతన ధర్మాన్ని కించపరిచే చర్యలను అడ్డుకునేందుకు బలమైన, కఠినమైన చట్టాన్ని వెంటనే తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. ఆ చట్టాన్ని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో ఈ వారాహి డిక్లరేషన్‌ను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారాహి డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలను పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ క్రమంలోనే దేశంలో అమలవుతున్న చట్టాలు, కోర్టులపై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సనాతన ధర్మం పాటించే వారి పట్ల చట్టాలు నిర్ధాక్షిణ్యంగా పని చేస్తున్నాయని.. అదే సనాతన ధర్మాన్ని దూషించే వారికి మాత్రం కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. అయిన వాళ్లకు ఆకులు.. కాని వాళ్లకు కంచాలు అన్నట్టు ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆకులు కూడా పోయాయని.. చేతుల్లో పెట్టి నాకేసుకోమంటున్నారని పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు.

సనాతన ధర్మం వైరస్ లాంటిదని.. దాన్ని నాశనం చేయాలని పిలుపునిచ్చిన తమిళనాడు మంత్రి, డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్.. ఇలాంటి మాటలను ఇస్లాం గురించి అంటే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయని.. నిర్ధాక్షిణ్యంగా శిక్షిస్తాయని తెలిపారు. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టినా, శ్రీరాముడిని పాద రక్షలతో కొట్టినా సరస్వతి అమ్మవారిని తిట్టినా ఏం చేసినా ఒక్క కోర్టు మాట్లాడదని.. అలాంటి వారిని ఏదైనా అనాలంటే కోర్టులు కూడా భయపడతాయని.. ఇది న్యాయానికి ఉదాహరణ అని అన్నారు.

వారాహి డిక్లరేషన్‌(Varahi Declaration)లోని ముఖ్యాంశాలు

  • ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి.
  • సనాతన ధర్మ పరిరక్షణ కోసం, దానికి భంగం కల్గించే చర్యలను అరికట్టేందుకు దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టాన్ని తక్షణమే తీసుకురావాలి.
  • సనాతర ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి.
  • సనాతన ధర్మం పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి.
  • సనాతన ధర్మాన్ని కించపరిచి, ద్వేషం వ్యాప్తి చెందించే వ్యక్తులు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి.
  • ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి.
  • ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి.

About amaravatinews

Check Also

ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు జమ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత ఐదేళ్లుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *