హిందీని రుద్దడాన్ని నేను వ్యతిరేకించాను! మరోసారి భాషా వివాదంపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌

పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తుండగా, పవన్ కళ్యాణ్ హిందీని వ్యతిరేకించేవారు తమ సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తారని ప్రశ్నించారు. డీఎంకే నేతలు కూడా స్పందిస్తూ హిందీని బలవంతం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మరోసారి ఈ అంశంపై ట్వీట్ చేశారు.

హిందీ భాషా గురించి కొనసాగుతున్న వివాదం గురించి తెలిసిందే. తమపై హిందీని బలవంతంగా కేంద్రం రుద్దుతుందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. అలాంటిదేం లేదని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఈ క్రమంలో శుక్రవారం పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ హిందీ భాషను వ్యతిరేకించడంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. హిందీని వ్యతిరేకించేవారు తమ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్‌ చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. అన్ని భాషలు అవసరమే అంటూ పరోక్షంగా తమిళనాడు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ క్రమంలో పవన్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌గా డీఎంకే పార్టీ నేతలు కూడా స్పందించారు. తాము హిందీని ద్వేషించడం లేదని, తమపై బలవంతంగా రుద్దడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామంటూ పేర్కొన్నారు.

దీంతో పవన్‌ కళ్యాణ్‌ మరోసారి హిందీ భాష వివాదం గురించి సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. “ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం, రెండూ మన భారతదేశ జాతీయ, సాంస్కృతిక ఏకీకరణను సాధించడంలో ఉపయోగపడవు. నేను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదు. దానిని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే నేను వ్యతిరేకించాను. NEP(నేషనల్‌ ఎడ్యూకేషన్‌ పాలసీ) 2020లో హిందీని తప్పనిసరి చేయలేదు, దానిపై తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. NEP 2020 ప్రకారం, విద్యార్థులు విదేశీ భాషతో పాటు ఏవైనా రెండు భారతీయ భాషలను (వారి మాతృభాషతో సహా) నేర్చుకునే వెసులుబాటు ఉంది.

వారు హిందీ వద్దనుకుంటే, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ, అస్సామీ, కాశ్మీరీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, సింధీ, బోడో, డోగ్రీ, కొంకణి, మైథిలి, మెయిటీ, నేపాలీ, సంతాలి, ఉర్దూ లేదా ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చు. బహుళ భాషా విధానం విద్యార్థులకు ఎంపిక చేసుకునే సాధికారత కల్పించడానికి, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి, భారతదేశ గొప్ప భాషా వైవిధ్యాన్ని కాపాడటానికి దీన్ని రూపొందించారు. రాజకీయ అజెండాల కోసం ఈ విధానాన్ని తప్పుగా అర్థం చేసుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ తన వైఖరిని మార్చుకున్నాడు అనడం అవగాహన లేమిని ప్రతిబింబిస్తుంది. ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యా ఎంపిక అనే సూత్రానికి జనసేన పార్టీ దృఢంగా కట్టుబడి ఉంది.” అని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు.

About Kadam

Check Also

‘ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశానం’.. RSS చీఫ్ భగవత్ సామాజిక ఐక్యతా మంత్రం

అలీఘర్‌లో ఐదు రోజుల పర్యటనలో ఉన్న RSS చీఫ్ మోహన్ భగవత్ వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ఓ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *