ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉదయం గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసిన పవన్ కళ్యా్ణ్.. ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఏపీలో టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ సహా మొత్తం ఏడు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు.. భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కేంద్రం సహకారాన్ని కోరారు. వీటిపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని పవన్ తెలిపారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన అంశాలలో గండికోట కూడా ఉన్నట్లు తెలిసింది. వైఎస్ఆర్ జిల్లాలో ఉన్న గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేసే విషయమై కేంద్ర మంత్రి షెకావత్ వద్ద పవన్ కళ్యాణ్ పలు ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. దీనికి కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అలాగే ఇటీవల తిరుపతిలో ప్రకటించిన వారాహి డిక్లరేషన్‌ను కూడా పవన్ కళ్యాణ్ గజేంద్ర సింగ్ షెకావత్‌కు అందజేశారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి, జలవనరుల శాఖ మంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు.