ఎమ్మెల్యేగా గెలిచిన తాను పూర్తి జీతం తీసుకుంటానని పవన్ కల్యాణ్ తెలిపారు. దీంతో ఆయనకు ఎంత జీతం వస్తుందో అనే చర్చ మొదలైంది. ఆయనకు కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు. డిప్యూటీ సీఎం, మంత్రి కూడా. మరి ఆయన అదనంగా సమకూరే సదుపాయాలు ఏంటి అన్నవి తెలుసుకుందాం పదండి.
ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన 100 శాతం స్ట్రైయిక్ రేటు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. ఇక కొత్త ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా, మంత్రిగా వ్యవహరించనున్నారు. అయితే ఎమ్మెల్యేగా తాను పూర్తి జీతం తీసుకుంటానని పవన్ కల్యాణ్ పవన్ ఇటీవల వ్యాఖ్యానించారు. అప్పుడే.. ప్రజలు తనను ప్రశ్నించగలరని.. ప్రజల సొమ్ము తింటున్న బాధ్యత తనకు గుర్తు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఏపీలో ఎమ్మెల్యేలకు ఎంత జీతం వస్తుంది..? ఇతర అలవెన్సుల కింద ఎంత ప్రభుత్వం కేటాయిస్తుంది.. వంటి వివరాలు తెలుసుకుందాం పదండి…
ఏపీలో ప్రస్తుతం ఎమ్మేల్యేకు జీతభత్యాల కింద లక్షా 25 వేల రూపాయల వరకు ముడుతుంది. అయితే రాష్ట్రంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ అందుబాటులోని లేనందున మరో 50 వేల రూపాయలు HRA(House Rent Allowance) కింది పే చేస్తున్నారు. వీటికి తోడు సిట్టింగ్ అలవెన్స్, టెలిఫోన్ సదుపాయాలు అందుతాయి. అయితే ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి ఛైర్మన్, మండలి డిప్యూటీ ఛైర్మన్, ప్రభుత్వ చీఫ్ విప్, విప్స్, పీఏసీ ఛైర్మన్, ప్రతిపక్ష నేత హోదా ఉన్నటువంటి నాయకులకు ఎమ్మెల్యేల కన్నా ఎక్కువగానే జీతభత్యాలు అందుతాయి.
అయితే అన్ని రాష్ట్రాల్లో ఇలానే ఉండాలని లేదు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బట్టి జీతభత్యాలను నిర్ణయిస్తారు. మాజీ ఎమ్మెల్యేలకు కూడా పెన్షన్, మెడికల్, ట్రావెల్ సదుపాయాలు ఉంటాయి. ఒకవేళ మాజీ ఎమ్మెల్యే మరణిస్తే.. వారి భాగస్వామికి పింఛన్ ఇస్తారు. ఇక దేశం మొత్తంలో ఎమ్మెల్యేలకు అత్యధిక వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. అక్కడ ఎమ్మెల్యేకు ఏకంగా 2 లక్షల 50 వేల వరకు చెల్లిస్తున్నారు.
కాగా పవన్ కల్యాణ్ మొత్తం సంపూర్ణ జీతం తీసుకుంటానని ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు లక్షా 75 వేల వరకు జీతభత్యాలు అందే అవకాశం ఉంది. ఇక డిప్యూటీ సీఎం, మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఆయనకు అదనపు సదుపాయాలు, సౌకర్యాలు సమకూరే అవకాశం ఉంది.