ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఓటమి.. విద్యార్థులను చితకబాదిన పీఈటీ.. వైరల్ వీడియో

ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఓడిపోయారని విద్యార్థులపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్.. వారి పట్ల దుర్మార్గంగా వ్యవహరించాడు. విద్యార్థులను ఇష్టమొచ్చినట్టు కాళ్లతో తన్ని, జుట్టుపట్టుకుని ఈడ్చిపడేసి చెప్పు తీసుకుని కొట్టాడు. దారుణమైన ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరు సమీపంలో ఇటీవల చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు తీవ్రంగా స్పందించారు. విద్యార్థులపై దౌర్జన్యానికి పాల్పడిన సదరు పీఈటీని విధుల నుంచి సస్పెండ్ చేశారు. పోలీసులు కూడా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. మెట్టూరు సమీపంలోని ఓ ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు.. స్థానికంగా నిర్వహించిన ఓ ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొన్నారు. అయితే, మ్యాచ్‌లో స్కూల్ టీమ్ ఓడిపోవడంతో పీఈటీ టీచర్‌గా విధులు నిర్వహిస్తోన్న అన్నామలై కోపోద్రిక్తుడయ్యాడు. విద్యార్థులను గ్రౌండ్‌లో కూర్చోబెట్టి వారిని కొట్టి, కాళ్లతో తన్నాడు. అక్కడితో ఆగకుండా జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి ఎత్తికుదేశాడు. నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ వారిపై రెచ్చిపోయాడు. ‘మీరు అసలు అబ్బాయిలా? అమ్మాయిలా.. మీరు అంత చెత్త ఆట ఆడారేంటి.. బాల్ గోల్ పోస్ట్‌లోకి వెళ్తుంటే అడ్డుకోలేకపోయారు.. ఒత్తిడిలో ఆడలేరా?.. మీ మధ్య ఎందుకు సమన్వయం కొరవడింది’ టీమ్‌ గోల్‌కీపర్‌ అయిన విద్యార్ధిని నిలదీస్తూ ఆరుస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. అంతేకాదు, ఇందో విద్యార్ధి చెంపచెల్లుమనిపించాడు. మిగతా విద్యార్థుల అందరి ముందు వారిని ఘోరంగా అవమానించాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. తక్షణమే స్పందించిన అధికారులు.. అతడ్ని సస్పెండ్ చేశారు. దీనిపై తదుపరి విచారణకు ఆదేశించినట్టు సేలం జిల్లా విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరించిన పీఈటీపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మ్యాచ్‌లో ఓడిపోతే విద్యార్థుల పట్ల అంత కర్కశకంగా వ్యవహరించడం ఏంటి? అని.. ఈ అధికారం ఆయనకు ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. అసలు ఆయన పీఈటీ ఉద్యోగానికి అనర్హుడని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

About amaravatinews

Check Also

CBSE బోర్డు కొత్త రూల్స్.. 10, 12 తరగతి పరీక్షలకు 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే!

జాతీయ విద్యా విధానం (NEP) 2020కి జవాబుదారీతనం, క్రమశిక్షణ, సరైన అమలును నిర్ధారించడానికి CBSE బోర్డు తాజాగా కీలక మార్గదర్శకాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *