2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలనే లక్ష్యంతో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ‘వికసిత్ భారత్’థీమ్‌తో నిర్వహిస్తున్నారు. అప్పటికి భారతావనికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుంది. అందుకే ఆ సమయానికి భారత్‌ను సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రభుత్వం ఈ థీమ్ని ఎంపికి చేసింది. ఈ ఏడాది వేడుకలకు 6 వేల మంది అతిథులను ఆహ్వానించారు. వీరిలో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులతోపాటు లఖ్‌పతీ దీదీ, డ్రోన్ దీదీ వంటి పథకాల లబ్ధిదారులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
78 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని వరుసగా 11వ సారి మోదీ ఆవిష్కరించడం విశేషం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆయన అధిగమించారు. అయితే, ఇప్పటి వరకూ అత్యధికంగా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 17 సార్లు జెండాను ఎగురవేయగా.. ఆయన తర్వాత ఇందిరాగాంధీ 16 సార్లు రెండో స్థానంలో ఉన్నారు. వారి తర్వాతి స్థానంలో మోదీ ఉన్నారు.
తొలుత రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన అనంతరం ఎర్రకోటకు చేరుకున్న మోదీ.. త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు. తర్వాత సైనికుల నుంచి గౌరవందనం స్వీకరించారు. ఎర్రకోటపై హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. హర్ ఘర్ తిరంగా పేరుతో వేడుకలను నిర్వహించుకుంటున్నామని అన్నారు.
‘భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తి దాయకం.. దేశం కోసం పోరాడిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకుందాం.. దేశం కోసం జీవితాలను ఫణంగా పెట్టిన మహానుభావులు ఎందరో ఉన్నారు.. ప్రాణాలను అర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉంటుంది.. ఎన్నో త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్య్రం.. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నాం.. 40 కోట్ల మంది స్వాతంత్య్రాన్ని సాధిస్తే.. 140 కోట్ల మంది ఇంకేమైనా సాధించవచ్చు..’ అని అన్నారు.