Narendra Modi: ఇటీవల కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగినపడిన ఘటన దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. గత నెల 30 వ తేదీన వయనాడ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తులో 416 మంది దుర్మరణం చెందగా.. 150 మందికి పైగా గల్లంతయ్యారు. వందలాది మంది గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా వయనాడ్‌లో ప్రకృతి విపత్తు చోటు చేసుకున్న ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ క్రమంలోనే బాధితులకు అండగా నిలిచిన ప్రధాని మోదీ.. వారి కష్టాలను, బాధలను తెలుసుకుని చలించిపోయారు. మొదట హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూ నిర్వహించిన ప్రధాని.. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ నిర్మించిన 190 అడుగుల బెయిలీ వంతెనను పరిశీలించారు. అనంతరం వయనాడ్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని వెంట ఉన్నారు. మరోవైపు.. వయనాడ్‌లో పునరావాసం, సహాయక చర్యల కోసం రూ. 2 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించాలని కేరళ ప్రభుత్వం.. కేంద్రాన్ని కోరింది.

Amaravati News Navyandhra First Digital News Portal