గృహాలకు ఉచిత విద్యుత్‌ పథకానికి విశేష స్పందన.. 1.45 కోట్ల మంది రిజిస్ట్రేషన్..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి విశేష స్పందన లభిస్తోంది. మన దేశంలోని పౌరుల ఇళ్ళకు ఉచిత విద్యుత్ ను అందించేందుకు ప్రవేశ పెట్టిన పథకం. ఈ పథకాన్ని ఫిబ్రవరి 15, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ పథకంతో దేశంలో కోటి ఇళ్లలో సౌర ఫలకాలను అమర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. అప్పుడు ప్రభుత్వం విద్యుత్ కోసం చేస్తున్న ఖర్చు ఏడాదికి సుమారు 75,000 కోట్ల రూపాయలు అదా అవుతుందని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ వెల్లడించారు.

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఇళ్ళపై, తమ పైకప్పులపై సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందించనున్నారు. సోలార్ ప్యానెళ్ల ఖర్చులో 40% వరకు సబ్సిడీ ఇస్తున్నారు. ఈ పథకం గురించి కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ దేశంలో దాదాపు 1.45 కోట్ల రిజిస్ట్రేషన్‌లు జరిగాయని, 6.34 లక్షల ఇన్‌స్టాలేషన్‌లు పూర్తయ్యాయని పార్లమెంటులో ఒక ప్రకటనలో తెలిపారు. 75,021 కోట్ల బడ్జెట్‌తో 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రెసిడెన్షియల్ సెక్టార్‌లో 1 కోటి రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌లను సాధించడం ఈ పథకం లక్ష్యమని వెల్లడించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ పధకం మొదలు పెట్టగా..కేవలం పది నెలల్లోనే ఏకంగా 1.45 కోట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ పార్లమెంటుకు తెలిపారు. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న ధరఖాస్తుల్లో 26.38 లక్షల పరిశీలించినట్లు 6.34 లక్షల రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌లను పూర్తి చేసినట్లు కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. 3.66 లక్షల మంది దరఖాస్తుదారులకు సబ్సిడీ ఇచ్చారు. అంతేకాదు ఇక నుంచి క్రమం తప్పకుండా 15 నుంచి 21 రోజులలోపు విడుదల చేస్తామని కొత్త , పునరుత్పాదక ఇంధనం.. విద్యుత్ శాఖ మంత్రి (MoS) తెలిపారు.

అధికారిక సమాచారం ప్రకారం, ఈ కార్యక్రమం కింద గుజరాత్‌లో గరిష్టంగా 2,86,545 సోలార్ ఇన్‌స్టాలేషన్‌లు జరిగాయి. 1,26,344 ఇన్‌స్టాలేషన్‌లతో మహారాష్ట్ర తర్వాతి స్థానంలో ఉండగా, 53,423 ఇన్‌స్టాలేషన్‌లతో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసే మార్గంలో ఏవైనా సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ REC, డిస్కమ్‌లు , విక్రేతలతో సహా అన్ని వాటాదారులతో భాగస్వామ్యం కలిగి ఉందని నాయక్ చెప్పారు.

రాయితీ ఎలా పొందాలంటే

ఈ పథకం కింద కేంద్రం ఒక్కో కిలోవాట్ కు రూ.30 వేలు సబ్సిడీని ఇస్తుంది. రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు రూ.78 వేలు రాయితీ ఇస్తుంది. అంటే 3 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ లను ఏర్పాటు చేసుకుంటే రూ.1.45 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం రూ.78 వేలు ఇస్తుంది.. మిగిలిన డబ్బులను బ్యాంకులు రుణంగా ఇస్తాయి.

About Kadam

Check Also

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఈసారి ఎన్ని పోస్టులున్నాయంటే?

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2025, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) ఎగ్జామినేషన్‌ 2025.. ఈ రెండు నోటిఫికేషన్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *