కోల్‌కతాలో అర్ధరాత్రి అనూహ్య పరిణామం.. వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఆస్పత్రి ధ్వంసం

కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచారం ఘటనపై మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం అర్ధరాత్రి 11.55 గంటలకు ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్ర్యం’ పేరుతో ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో ఆర్జీ కార్ హాస్పిటల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేసిన పోలీసులు.. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులకు గాయాలయ్యాయి. డజన్లుకొద్దీ గుర్తుతెలియని వ్యక్తులు ఆస్పత్రిలోకి చొరబడే ప్రయత్నం చేశారని, వారిని అడ్డుకోడానికి ప్రయత్నించామని ఓ అధికారి పేర్కొన్నారు.

రెండు పోలీస్ వాహనాలు, ఓ బైక్‌కు ఆందోళకారులు నిప్పంటించారు. నిరసన ప్రదర్శన చేపట్టాడానికి కొద్ది సేపటి ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. బారికేడ్లను తోసుకుంటూ దూసుకొచ్చిన ఆందోళనకారులు.. వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. వీధుల్లోనూ పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆసుపత్రికి చేరుకుని.. పరిస్థితి సమీక్షించారు. మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

‘మీడియా తప్పుడు ప్రచారం వల్లే ఈ ఘటన జరిగింది.. హానికరమైన మీడియా ప్రచారం కారణంగా కోల్‌కతా పోలీసులు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. మీడియా నుంచి చాలా ఒత్తిడి ఉంది’ అని మండిపడ్డారు. ఈ సమయంలో కమిషనర్ సంయమనం కోల్పోయారు. ‘మేము ఎవరినీ కాపాడేందుకు ప్రయత్నించలేదని మా టీమ్‌లోని ప్రతి సభ్యుడి మాటగా నేను మీకు చెప్తున్నాను.. మేము బాధ్యతాయుతమైన శక్తిగా ఉన్నాం.., మేము అలాంటి సాక్ష్యాలను నాశనం చేయలేం’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ.. ఆసుపత్రిపై దాడికి బాధ్యులను గుర్తించి 24 గంటల్లోనే వారిని చట్టం ముందు నిలబెట్టాలని కమిషనర్‌కు సూచించారు. ‘ఆర్జీ కార్ హాస్పిటల్‌పై అల్లరి మూక దాడిచేసి అన్ని హద్దులను దాటేశారు.. నిరసన తెలుపుతున్న వైద్యుల డిమాండ్లు న్యాయమైనవి… ఇది వారు ప్రభుత్వం నుంచి ఆశించడం కనీసం.. వారి భద్రత, రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’ అని అభిషేక్ కోరారు. ఈ దాడి పాల్పడింది టీఎంసీ గూండాలేనని ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఆరోపించడం గమనార్హం. బెంగాల్ సీఎం మమతా బెనర్జీయే వారిని పంపారని ధ్వజమెత్తారు.

About amaravatinews

Check Also

CBSE బోర్డు కొత్త రూల్స్.. 10, 12 తరగతి పరీక్షలకు 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే!

జాతీయ విద్యా విధానం (NEP) 2020కి జవాబుదారీతనం, క్రమశిక్షణ, సరైన అమలును నిర్ధారించడానికి CBSE బోర్డు తాజాగా కీలక మార్గదర్శకాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *