కొందరికి కుర్చీపైనే ఆశ.. బెంగాల్ సీఎం మమత వ్యాఖ్యలు
మెడికోల ఆందోళన వెనక రాజకీయాలు ఉన్నాయని విమర్శ
కోల్‌కతా, సెప్టెంబరు 12: స్థానిక ఆర్‌జీ కర్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు గురువారం కూడా తమ వైఖరిని సడలించుకోలేదు.
చర్చలకు రావాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆహ్వానించినప్పటికీ వారు సానుకూలంగా స్పందించలేదు. వరుసగా మూడో రోజు కూడా ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల మధ్య చర్చలు జరగలేదు. దీనిపై మమత స్పందిస్తూ ”సామాన్యులకు న్యాయం చేయడం కోసం పదవిని వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాన”ని ప్రకటించారు. అయితే ఈ ఆందోళన వెనక రాజకీయాలు ఉన్నాయని ఆరోపించారు. ”చాలా మంది డాక్టర్లు చర్చకు సుముఖంగా ఉన్నారన్న సంగతి నాకు తెలుసు. కానీ కొద్దిమంది మాత్రం ప్రతిష్ఠంభన ఏర్పడాలని కోరుకుంటున్నారు” అని విమర్శించారు. రాజకీయ దురుద్దేశాలతో ఆందోళన జరుగుతోందని, దీనికి వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయన్నారు. ”సామాన్య ప్రజలకు న్యాయం చేసేందుకు పదవి నుంచి వైదొలగడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ వారు న్యాయం కోరుకోవడం లేదు. వారికి కేవలం కుర్చీ మాత్రమే కావాలి” అని వ్యాఖ్యానించారు. జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపేందుకు తాను సచివాలయంలో రెండు గంటల పాటు ఎదురు చూశానని, వారు సెక్రటేరియట్‌కు వచ్చినా సమావేశంలో కూర్చోలేదని మమత చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. విధుల్లో చేరాలని మరోసారి ఆమె విజ్ఞప్తి చేశారు.
మమత పాల్గొనే కార్యక్రమాలకు వెళ్లను: గవర్నర్
ఆర్‌జీ కర్ వైద్య కళాశాలలో జరిగిన అత్యాచారం, హత్య ఘటనల విషయమై బెంగాల్ సమాజం చేస్తున్న సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు గవర్నర్ ఆనంద బోస్ తెలిపారు. రాజీనామాకు సిద్ధమని మమత ప్రకటించిన కొద్ది గంటలకే గవర్నర్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ‘సామాజికంగా బహిష్కరిస్తున్నట్టు’ ఆయన ప్రకటించారు. సామాజిక బహిష్కరణ అంటే ఏమిటో వివరణ ఇచ్చారు. ఆమెతో కలిసి ఏ ప్రజా వేదికపైనా కూర్చోబోనని, ఆమె పాల్గొనే ఏ ప్రజా కార్యక్రమానికీ హాజరు కాబోనని తెలిపారు.