ఏపీలో సంచలన రేపిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి.. పీఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ సమక్షంలో ఇవాళ ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. 2021లో కృష్ణారెడ్డి వివేకా కుమార్తె సునీత రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై పులివెందుల కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుతో అప్పటి పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేయగా.. తాజాగా కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు ఇప్పుడు వాంగ్మూలం రికార్డు చేయడంతో ప్రాధాన్యం ఏర్పడింది. లాయర్ల సమక్షంలో కృష్ణారెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.
వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్. వివేకా హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఒత్తిడి చేశారని కూడా ఆరోపించారు. 2023లో పులివెందుల కోర్టు విచారణ జరిపి.. ముగ్గురి (సునీత రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్పీ రామ్‌సింగ్)పై కేసు నమోదు చేసి తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.
ఆ వెంటనే పులివెందుల పోలీసులు సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేసి ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అభియోగపత్రం దాఖలు చేశారు. అయితే పులివెందుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతోపాటు పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేయాలని సునీత రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఎస్పీ రామ్‌సింగ్‌లు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు.. పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటిని నాలుగు వారాలు నిలుపుదల చేసింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరమని తెలిపింది. అయితే ఆ తర్వాత ఈ ముగ్గురు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది.