Punjab Company donates 21 crore to TTD Trust: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ)కు భారీ విరాళం అందింది. పంజాబ్‌కు చెందిన ఓ కంపెనీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం అందించింది. ఏకంగా 21 కోట్ల రూపాయలను ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది పంజాబ్‌కు చెందిన ట్రైడెంట్ గ్రూప్. ఈ సంస్థకు చెందిన రాజిందర్ గుప్తా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి ఈ విరాళం తాలూకు చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఈవో వారిని అభినందించారు. మరోవైపు ప్రాణదాన ట్రస్టు సేవలను గుర్తించే ఈ విరాళం ఇచ్చినట్లు రాజిందర్ గుప్తా తెలిపారు.
మరోవైపు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీవెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు ద్వారా నిరుపేదలకు ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కిడ్నీ, గుండె, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న వారికి ఈ ట్రస్టు అండగా నిలుస్తోంది. ఎస్వీ ప్రాణదాన ట్రస్టు ద్వారా ఇలాంటి వారికి ఉచితంగా వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని స్విమ్స్, బర్డ్, ఎస్వీఆర్ఆర్, మెటర్నిటీ ఆసుపత్రులలోఉచితంగా చికిత్స అందిస్తారు. ఈ ట్రస్టు చేపడుతున్న సేవా కార్యక్రమాలను గుర్తించి పలువురు విరాళాలు ప్రకటిస్తుంటారు. ఈ క్రమంలోనే పంజాబ్ సంస్థ కూడా 21 కోట్లు విరాళంగా ఇచ్చింది.
ఆగస్ట్ 16న తిరుమలలో ఛత్రస్థాపనోత్సవం
మరోవైపు తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆగస్ట్ 16వ తేదీ ఛత్రస్థాపనోత్సవం జరుగనుంది. ఈ ఉత్సవం సందర్భంగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఏటా ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఉత్సవం కోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఏడుకొండల్లోనే అతి ఎత్తైన నారాయణగిరిపై వెంకటేశ్వరస్వామి మొదటగా కాలు మోపినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి రోజున ఈ ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తారు.
ఈ ఉత్సవం సందర్భంగా బంగారు బావి నుంచి నీటిని సేకరిస్తారు. అలాగే శ్రీవారి ఆలయం నుంచి పూజా సామాగ్రిని తీసుకువస్తారు. ఆ తర్వాత రంగనాయకుల మండపం నుంచి మంగళవాయిద్యాలతో మేదరమిట్టకు చేరుకుంటారు. అనంతరం బంగారుబావి నుంచి తీసుకువచ్చిన నీటితో శ్రీనివాసుడి పాదాలకు తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత పాదాల చెంత గొడుగును ప్రతిష్టించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు.