ఏపీవాసులకు గుడ్‌న్యూస్.. నెరవేరనున్న ఏళ్ల నాటి కల.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!

Railway Zone: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ.. ఏపీలో తిరుగులేని సీట్లతో అధికారంలోకి రావడంతో.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నాయి. ఒకప్పుడు అవన్నీ కలలుగానే ఉండగా.. రెండోసారి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎన్డీఏలో భాగస్వామ్యం కావడంతో ఇప్పుడిప్పుడే అవన్నీ ముందడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుభవార్త తెలిపింది. విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రైల్వేజోన్‌ ఏర్పాటు కానుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో పని చేస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించి భూ కేటాయింపులు, ఇతర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం ఉందని అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఇక అతి త్వరలోనే.. రైల్వే జోన్‌ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి అవసరమైన సన్నాహాలకు సిద్ధమవుతామని చెప్పారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఏపీ వాసులు ఎదురుచూస్తున్న కల నెరవేరనుందని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో భూ విషయంలో అభ్యంతరాలు తలెత్తిన నేపథ్యంలో.. ఈ విషయంపై కూలంకషంగా చర్చించినట్లు తాజాగా అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని.. ఇప్పుడు రైల్వే జోన్‌ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయని శుభవార్త చెప్పారు.

మరోవైపు.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం విషయంలో ఆలస్యం జరుగుతూనే వస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అడిగిన 52 ఎకరాల భూమిని సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్ర జాప్యం ఏర్పడింది. దీంతో రైల్వేజోన్ కార్యాలయం ఏర్పాటులో ఆలస్యం అవుతూ వస్తోంది. తాజాగా రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన ప్రకటనతో.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ముందడుగు పడినట్లు అయింది. దీంతో కేంద్రం చేసిన ఈ ప్రకటనతో ఉత్తరాంధ్ర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

About amaravatinews

Check Also

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్‌లు నిత్యావసర వస్తువులుగా తయారయ్యాయి. వాటిని కరెక్ట్‌గా వాడకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *