విశాఖ రైల్వే జోన్ అంశానికి సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది. రైల్వే జోన్ కోసం కొత్తగా భూమి కేటాయించనున్నట్లు మాచారం. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. విశాఖ రైల్వే జోన్ అంశమై ఏపీ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని చెప్పారు. ఈ విషయమై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా తనతో ఎప్పుటికప్పుడు మాట్లాడుతున్నారని రైల్వే మంత్రి తెలిపారు. విశాఖ రైల్వేజోన్ కార్యాలయం ఏర్పాటు కోసం గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలం.. నీళ్లు నిలిచే ప్రాంతమని.. వేరే భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. ఈ ప్రకారమే కొత్తగా భూమిని కేటాయించనున్నట్లు తెలిపారు.
మరోవైపు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం అడిగిన 52 ఎకరాల భూమిని సమకూర్చడంలో ఆలస్యమైంది. దీంతో రైల్వేజోన్ కార్యాలయం ఏర్పాటులో జాప్యం జరుగుతూ వస్తోంది. అయితే ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉండటంతో రైల్వే జోన్ ఏర్పాటు పనులు పుంజుకుంటాయని ఉత్తరాంధ్ర వాసులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం రైల్వే జోన్ కోసం కొత్తగా భూమిని కేటాయించనున్నట్లు వార్తలు రావటంతో.. ఏర్పాటు పనులు మొదలవుతాయని మరోవైపు దేశవ్యాప్తంగా ఎనిమిది కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ప్రాధాన్యం లభించింది. మొత్తం రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. వీటిలో ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు కూడా రైల్వే లైన్ ప్రతిపాదన ఉంది. మొత్తం రూ.4,109 కోట్లతో ఈ మార్గంలో 200.60 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తి అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు.. ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానం పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉండటంతోనే ఏపీకి ప్రాధాన్యం పెరిగిందని భావిస్తున్నారు.