టీడీపీ మహిళా ఎమ్మెల్యే పెద్ద మనసు చాటుకున్నారు. తన నియోజకవర్గంలో ప్రజల కష్టాలను చూడలేకపోయారు.. వెంటనే సొంత డబ్బులతో అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఇటీవల రంపచోడవరం మండలం దారగూడెంకు చెందిన నెరం పద్మకాకినాడ జీజీహెచ్‌లో చనిపోయింది. అయితే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకుండా పోయింది. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబసభ్యులు రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే స్వచ్ఛందంగా రూ.5500లతో అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి మృతదేహం గ్రామానికి చేర్చారు.
రంపచడోవరం నియోజకవర్గంలో ఇక నుంచి ఎవరూ అంబులెన్స్ అందుబాటు లేక ఇబ్బంది పడకూడదని ఎమ్మెల్యే శిరీష నిర్ణయించుకున్నారు. దీని కోసం తన సొంత ఖర్చులతో ఓ అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వాహనాన్ని ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ప్రారంభిస్తామని ప్రకటించారు. కాకినాడ, రాజమహేంద్రవరం జనరల్ ఆసుపత్రుల్లో మృతి చెందిన వారిని స్వగ్రామాలకు తరలించడానికి.. అనారోగ్యానికి గురైన వారికి ఉచితంగా సేవలు అందిస్తామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం శిరీష్ అంబులెన్స్ సిద్ధం చేశారు.
ఈ విషయాన్ని టీడీపీ ప్రస్తావించింి. ‘ఏపీలోనే పెద్దదైన రంపచోడవరం నియోజకవర్గంలో ప్రజలను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా… ఆసుపత్రులలో మరణించిన వారిని ఇళ్లకు తీసుకువెళ్లాలన్నా సరైన సౌకర్యాలు లేవు. మూడు రోజుల క్రితం దారగూడెం గ్రామానికి చెందిన నెరం పద్మ అనే ఆశా కార్యకర్త అనారోగ్యంతో కాకినాడ జీజీహెచ్ లో మరణించారు. అయితే ఆమె భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేదు. విషయం తెలిసిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి సొంత ఖర్చు రూ. 5500 లతో అంబులెన్స్ ఏర్పాటు చేసారు. అంతేకాకుండా ఇకమీదట ఇలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక శాశ్వత అంబులెన్స్ ఏర్పాటు చేసారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9న దీన్ని అడవిబిడ్డలకు అంకితం చేయనున్నారు. అంగన్ వాడీ టీచర్ అయిన మిరియాల శిరీషాదేవికి చంద్రబాబుగారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె ప్రజాసేవను చూసి చంద్రబాబు గారి సెలక్షన్ గ్రేట్ అంటున్నారు ప్రజలు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ నేత అనంత బాబుకు టీడీపీ ఎమ్మెల్యే శిరీష గారికి తేడా గురించి ప్రజలు చెప్పుకుంటున్నారు’అంటూ ట్వీట్ చేశారు.
రంపచోడవరం నియోజకవర్గం విస్తీర్ణంలో రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గం. పశ్చిమాన భద్రాచలం నుంచి తూర్పున రాజా వొమ్మంగి వరకు 210 కిలోమీటర్లు వెడల్పు ఉత్తరాన డొంక రాయి నుంచి దక్షిణాన సీతపల్లి బాపనమ్మ గుడి వరకు 120 కీలో మీటర్లు పొడవు ఉంటుంది. 11 మండలాలతో రాష్ట్రంలో అత్యంత పెద్ద నియోజకవర్గం కాగా.. 75 శాతం అటవీ ప్రాంతం ఉంది. రాజమండ్రి, కాకినాడ, ఏలేశ్వరం, రంపచోడవరం, నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ప్రాంత ప్రజలు ఎవరు అయిన చనిపోతే వారి మృత దేహాలు స్వగ్రామాలకు తీసుకుని వెళ్లాలంటే ఎన్నో వ్యవ ప్రయాసలు తప్పవు. సకాలంలో వైద్యం అందక చనిపోయే వారూ ఎక్కువగా ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే శిరీష దంపతులు రంపచడోవరం నియోజకవర్గం ప్రజలకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారన్నారు.