Tata Group: రతన్ టాటా.. ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల పారిశ్రామికవేత్తల్లో ఒకరు. అయినా ఏ రోజునా సంపన్నులతో కలిసి కనిపించలేదు. టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అత్యంత నిరాడంబరుడు. ప్రపంచ వ్యాప్తంగా 6 ఖండాల్లో 100 దేశాల్లోని టాటా గ్రూప్‌నకు చెందిన 30 కంపెనీలకు రతన్ టాటా నేతృత్వం వహించారు. అయినప్పటికీ అత్యంత అసాధారణ జీవితాన్ని గడిపారు. జేఆర్‌డీ టాటా నుంచి బాధ్యతలు అందుకున్న ఆయన.. టాటా గ్రూప్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చారు. కార్పొరేట్ టైటాన్‌గా పేరుగాంచారు. 1937, డిసెంబర్ 28న జన్మించిన ఆయన పాఠశాల విద్యాభ్యాసాన్ని ముంబైలో పూర్తి చేశారు. 1955లో న్యూయార్క్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో పట్టా అందుకున్నారు. 1962లో తొలి సారి టాటా గ్రూప్‌లో చేరారు.
తొమ్మిదేళ్ల పాటు టాటా స్టీల్‌లో ఒక సాధారణ ఉద్యోగిగా సేవలందించిన రతన్ టాటా.. నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి డైరెక్టర్- ఇంఛార్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 1977లో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎంప్రెస్ మిల్స్ బాధ్యతలు అందుకున్నారు. అయితే, అది కొద్ది రోజులకే మూతపడింది. 1991లో టాటా సన్స్ ఛైర్మన్‌గా జేఆర్‌డీ టాటా వైదొలిగిన తర్వాత ఆయన వారసుడిగా రతన్ టాటా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత తనదైన ముద్ర వేస్తూ సంస్థను విస్తరించారు. టాటా ఇండికా కార్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చి పేదవాళ్లకు కార్లను చేరువ చేశారు. ఆ తర్వాత టాటా నానో కారును తీసుకొచ్చారు. అయితే, అది పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పాలి.
2012, డిసెంబర్ 28వ తేదీన 75వ జన్మదినం సందర్భంగా ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. దాదపు 21 ఏళ్ల పాటు ఛైర్మన్‌గా కొనసాగారు. ఆయన హయాంలో గ్రూప్ ఆదాయం 40 రెట్లు పెరిగింది. కంపెనీ లాభాలు 50 రెట్లు పెరిగాయి. రతన్ టాటా తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన సైరస్ మిస్త్రీని 2016, అక్టోబర్ 24న తొలగించి మరోసారి ఆయనే తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2017, జనవరి 12న నటరాజన్ చంద్రశేఖరన్‌కు బాధ్యతలు అప్పగించి గౌరవ ఛైర్మన్‌గా కొనసాగారు.
పదవీ విరమణ తర్వాత వ్యక్తిగత హోదాలో 30 స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. అందులో ఓలా ఎలక్ట్రిక్, స్నాప్‌డీల్, జివావే, పేటీఎం వంటివి ఉన్నాయి. మరోవైపు.. దేశంలో ఆర్థిక సంస్కరణలు చేపడుతున్న సమయంలో టాటా గ్రూప్‌ను రతన్ టాటా పునర్వ్యవస్థీకరమించారు. అదే సమయంలో టాటా నోనో, ఇండికా కార్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించారు. అంతర్జాతీయంగానూ టాటా గ్రూపును విస్తరించడంలో తనదైన ముద్ర వేశారు రతన్ టాటా. ఆంగ్లో డచ్ స్టీల్ కంపెనీ కోరస్‌ను కొనుగోలు చేశారు. బ్రిటిష్ వాహన దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను టేకోవర్ చేశారు. అలాగే బ్రిటిష్ టీ కంపెనీ టెట్లీని కొనుగోలు చేశారు. 1991లో 5.7 బిలియన్ డాలర్లుగా ఉన్న టాటా గ్రూప్ విలువను 2016 సంవత్సరం నాటికి 103 బిలియన్ డాలర్లకు చేర్చారు.