Bank of Maharashtra: దేశంలోని అన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనేది పెద్దన్న లాంటింది. ఇదే అన్ని నియంత్రణాధికారాలు కలిగి ఉంటుంది. ఆర్బీఐ ఆదేశాల్ని ఇవి తప్పక పాటించాల్సిందే. కస్టమర్ల పట్ల ఏ మాత్రం బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. తమకు తెలియకుండా ఏదైనా కొత్త నిబంధనలు తీసుకొచ్చినా ఆర్బీఐ ఊరుకోదు. కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. దీనిని ఫైన్ రూపంలో లేదా మరీ సమస్య తీవ్రంగా ఉంటే ఏకంగా బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసేందుకూ వెనుకాడదు. ఇప్పుడు ఇదే బాటలో.. కేంద్ర బ్యాంకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన .. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు ఝలక్ ఇచ్చింది.
కేవైసీ (Know Your Customer- మీ ఖాతాదారు గురించి తెలుసుకో) సహా ఇతర నిబంధనల్ని పాటించడంలో విఫలమైందన్న కారణంతో.. ఈ బ్యాంకుకు రూ. 1.27 కోట్ల మేర జరిమానా విధించింది. ఈ మేరకు ఆర్బీఐ వెల్లడించింది.
లోన్ సిస్టమ్ ఫర్ డెలివరీ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్ సహా సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ ఇన్ బ్యాంక్స్‌కు సంబంధించి మరికొన్ని నిబంధనల్ని కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉల్లంఘించినట్లు ఆగస్ట్ 8న విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది ఆర్బీఐ. ఇదే సమయంలో కేవైసీ సహా NBFC కి సంబంధించిన కొన్ని రకాల నిబంధనలు పాటించలేదన్న కారణంతో.. ఉల్లంఘించినందుకు గానూ హిందుజా లేలాండ్ ఫైనాన్స్‌కు రూ. 4.90 లక్షలు, పూనావాలా ఫిన్‌కార్ప్ సంస్థకు 10 లక్షల రూపాయల జరిమానా విధించింది.
ఆయా సంస్థలకు ఆర్బీఐ ఈ మేరకు తమపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో చెప్పాలని నోటీసులు పంపించి బదులివ్వాలని కోరింది. వాటి స్పందనను పరిశీలించిన పిదప.. వివరణతో సంతృప్తి చెందక.. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేల్చి జరిమానాలు విధించినట్లు తెలిపింది. చాలా వరకు ఆర్బీఐ.. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులపైనే చర్యలు తీసుకునేది. ఇటీవల మాత్రం రూటు మార్చింది. పెద్ద పెద్ద బ్యాంకులపైనా కోట్లల్లో ఫైన్లు విధిస్తూ.. ఆంక్షల్ని కఠినతరం చేస్తుంది.
పీర్ టు పీర్ రుణ ప్లాట్‌ఫామ్‌లకు నిబంధనల్ని ఆర్బీఐ మరింత కఠినం చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం బోర్డ్ ఆమోదించిన విధానానికి అనుగుణంగానే రుణ సంస్థలు, రుణ గ్రహీతల అర్హతలు సరిపోకుంటే లోన్లు మంజూరు చేయొద్దు. పీర్ టు పీర్ లోన్లు ఇవ్వడాన్ని ఒక పెట్టుబడి స్కీంగా సదరు సంస్థలు ప్రచారం చేసుకోకూడదు. బీమా ఉత్పత్తులకు కూడా ఇవి విక్రయించొద్దు.