Jio 5G Voucher: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లు తీసుకొస్తోంది. ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న క్రమంలో తమ నెట్‌వర్క్ వీడుతున్న యూజర్లను అట్టిపెట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ఇప్పుడు మరో సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. 5జీ వోచర్ తీసుకొచ్చింది. దీని ద్వారా సంవత్సర కాలం పాటు 5జీ డేటాను వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అందుకు కేవలం రూ.601తో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ మేరకు రూ.601 అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ వోచర్ తెచ్చింది రిలయన్స్ జియో
ప్రస్తుత 4జీ వినియోగదారులు సైతం ఈ వోచర్ ఉపోయగించుకుని 5జీ సేవలను ఆనందించవచ్చని జియో ఓ ప్రకటనలో తెలిపింది. మొదట జియో 5జీ సేవలు ప్రారంభించినప్పుడు 5జీ స్మార్ట్ ఫోన్, నెట్‌వర్క్ ఉన్న వారందరికీ వెల్‌కమ్ ఆఫర్ ద్వారా ఫ్రీగా 5జీ డేటా అందించింది. రూ.239 అంతకంటే ఎక్కువ మొత్తంలో రీఛార్జ్ చేసిన వారందరికీ ఈ 5జీ డేటా అన్‌లిమిటెడ్‌గా ఇచ్చింది. కానీ, ఈ ఏడాది 2024, జులై నెలలో రీఛార్జ్ ప్లాన్ల ధరలను సవరించింది. ఆ తర్వాత అపరిమిత 5జీ డేటు ఇచ్చేందుకు పరిమితులు విధించింది. రోజుకు 2 జీబీ డేటా అందించే ప్లాన్ రీఛార్జ్ చేసిన వారికి మాత్రమే ట్రూ 5జీ ఉచిత డేటాను అందిస్తోంది. కనీసం నెలకు రూ.349 రీఛార్జ్ చేసుకున్న వారికి మాత్రమే ప్రస్తుతం ఉచిత 5జీ డేటా అందుతోంది.
దీంతో రోజుకు 1 జీబీ, 1.5 జీబీ డేటా ప్లాన్లు రీఛార్జ్ చేసుకునే వారికి ఉచిత ట్రూ 5జీ డేటా అందడం లేదు. ఈ క్రమంలోనే తక్కువ డేటా ప్లాన్లు తీసుకునే వారికి సైతం 5జీ సేవలు అందించేందుకు ఇటీవలే రూ.51, రూ.101, రూ.151 బూస్టర్ ప్లాన్లు తీసుకొచ్చింది జియో. తాజాగా ఏడాది పాటు అన్‌లిమిటెడ్ గా 5జీ డేటాను అందించేందుకు రూ.601 డేటా వోచర్ తీసుకొచ్చింది. దీన్ని మై జియో యాప్‌లో కొనుగోలు చేసి యాప్‌లోనే యాక్టివేచ్ చేసుకోవచ్చు. అంతే కాదు ఈ వోచర్‌ను తమ స్నేహితులకూ గిఫ్ట్ మాదిరిగా అందించవచ్చని జియో తెలిపింది.