Cloud Storage Pricing: ఇటీవల జరిగిన రిలయన్స్ ఏజీఎం (యాన్యువల్ జనరల్ మీట్) లో రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముకేశ్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. దీపావళి నుంచి 100 GB వరకు క్లౌడ్ స్టోరేజీని ఫ్రీగా అందించనున్నట్లు.. ఇది వెల్‌కం ఆఫర్ కింద వర్తిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈ విభాగంలో ఇప్పటికే కీలకంగా ఉన్నటువంటి గూగుల్, యాపిల్ సంస్థలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయిందని పేర్కొన్నారు విశ్లేషకులు. జియో ఎంట్రీతో.. ఇక క్లౌడ్ స్టోరేజీ విభాగంలో గూగుల్, యాపిల్ కూడా తమ సేవల ధరలు తగ్గించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ముఖ్యంగా ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లు స్టోరేజీ సమస్యను ఎప్పటినుంచో ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా.. ఆండ్రాయిడ్ యూజర్లలో చాలా మంది గూగుల్ ఫ్రీగా అందిస్తున్న 15 జీబీ డేటా పరిమితికి చేరువయ్యారు. చాలా మందికి ఈ స్టోరేజీ ఏమీ చాలట్లేదు. ఈ క్రమంలోనే అదనపు స్టోరేజీ కోసం గూగుల్ వన్‌ను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇక దీనిని కొనుగోలు చేస్తే.. ఛార్జీలు చెల్లించాల్సి వ్తుంది. ఇక్కడ ప్రస్తుతం 100GB గూగుల్ వన్ స్టోరేజీ ధర నెలకు రూ. 130 వరకు ఉండగా.. ఐ క్లౌడ్ లో 50 జీబీ స్టోరేజీ రేటు రూ. 75 గా ఉంది. ఇప్పుడు రిలయన్స్ జియో 100 GB వరకు ఫ్రీ గా ఇస్తామని ప్రకటన చేసింది.
రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశంలోనే అంబానీ క్లౌడ్ సేవలపై ప్రస్తావించారు. ‘ఫొటోలు, వీడియోలు సహా ఇతర డాక్యుమెంట్ల వంటి డిజిటల్ కంటెంట్‌ను జియో యూజర్స్ భద్రంగా దాచుకునేలా జియో క్లౌడ్ స్టోరేజీని తీసుకురాబోతున్నాం. వెల్‌కం ఆఫర్ కింద 100GB క్లౌడ్ స్టోరేజీని ఫ్రీగా అందిస్తాం. అంతకుమించి క్లౌడ్ స్టోరేజీ కావాలనుకుంటే కూడా.. వాళ్లకు అందుబాటులో ధరల్లోనే అందిస్తాం.’ అని అంబానీ పేర్కొన్నారు.