JIO IPO: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి మరో రెండు ఐపీఓలు త్వరలోనే స్టాక్ మార్కెట్లలోకి రానున్నాయి. దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూకు అంబానీ ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. జియో వచ్చే ఏడాది తొలి నాళ్లలోనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 100 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా మార్కెట్లలోకి అడుగు పెట్టాలని ముకేశ్ అంబానీ భావిస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ రిటైల్ విభాగం పబ్లిక్ ఇష్యూకు కాస్త ఆలస్యంగా తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రిలయన్స్ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి జియో, రిటైల్ విభాగాలను పబ్లిక్ ఇష్టూకు తీసుకొస్తామని 2019లోనే ప్రకటించారు ముకేశ్ అంబానీ. కానీ, ఆ తర్వాత వాటి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే, కేకార్, అబుధాభి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, జనరల్ అట్లాంటిక్ నుంటి డిజిటల్, టెలికాం రిటైల్ వ్యాపారాల కోసం 100 బిలియన్ డాలర్ల వద్ద 25 బిలియన్ డాలర్లు సేకరించేందుకు రిలయన్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది జియోను పబ్లిక్ ఇష్యూకు తీసుకొచ్చేందుకు రిలయన్స్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
స్థిర వ్యాపారం, బలమైన ఆదాయ వృద్ధితో రిలయన్స్ జియో దూసుకెళ్తోంది. ప్రస్తుతం 47 కోట్ల మంది చందాదారులతో దేశీయ అతిపెద్ద టెలికాం కంపెనీగా జియో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జియోను మొదటగా ఐపీఓకు తీసుకురావాలని రిలయన్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రిటైల్ విభాగం విషయంలో మాత్రం కాస్త సమయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. రిటైల్ విభాగంలో కొన్ని అంతర్గత సమస్యలు, నిర్వహణలోని సవాళ్లు ఐపీఓ మరింత ఆలస్యం అయ్యేలా కారణమవుతున్నాయని పేర్కొన్నాయి. అయితే, ఈ విషయాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఊహించినట్లుగానే వచ్చే ఏడాది రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూకు వచ్చినట్లయితే అతిపెద్ద ఐపీఓ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐపీఓ టైమ్‌లైన్ మారే అవకాశమూ ఉందని సమాచారం.