దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా నిత్యం కోట్లల్లో లావాదేవీలు జరుగుతున్నాయి. అలాగే మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీల్లో ఎస్మెమ్మెస్ ఆధారిత ఓటీపీ వ్యవస్థ అందుబాటులో ఉంది. అయితే, ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు పెరిగి పోయిన క్రమంలో ఓటీపీతో పాటు అదనపు అథెంటికేషన్ ఉండాల్సిన అవసరం ఉందని కీలక ప్రతిపాదనలు చేస్తూ ముసాయిదా ఫ్రేమ్‌వర్క్ విడుదల చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిజిటల్ పేమెంట్ల విషయంలో అథెంటికేషన్ కోసం ప్రత్యేకంగా ఒకే పద్ధతిని తప్పనిసరిగా వినియోగించాలని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేసింది. అయితే, చాలా వరకు డిజిటల్ పేమెంట్లలో ఎస్సెమ్మెస్ ఆధారిత విధానాన్ని అమలు చేస్తున్నట్లు గుర్తు చేసింది.
ఓటీపీ వ్యవస్థ పని తీరు సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా ప్రత్యామ్నాయ అథెంటికేషన్ వ్యవస్థలు అవసరమని ఆర్‌బీఐ తెలిపింది. అయితే, అదనపు అథెంటికేషన్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే కచ్చితంగా కస్టమర్ అనుమతి తీసుకోవాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కొత్త అథెంటికేషన్ వ్యవస్థ నుంచి వైదొలిగే అవకాశమూ కస్టమర్లకు కల్పించాలని పేర్కొంది. కార్డులతో చేసే లావాదేవీలు మినహా ఇతర డిజిటల్ పేమెంట్ల విషయంలో అథెంటికేషన్ ఉండాలని పేర్కొంది.
అన్ని డిజిటల్ పేమెంట్లకు అలర్ట్ పంపడాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ఆర్‌బీఐ ముసాయిదా ప్రతిపాదనల్లో తెలిపింది. ట్రాన్సాక్షన్లు ప్రారంభించే సంస్థలు ఏ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లతోను ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకోవద్దని తెలిపింది. ఫలితంగా ఎలాంటి అథెంటికేషన్ వ్యవస్థలనైనా ఎంచుకునే అవకాశ కస్టమర్లకు లభిస్తుందని పేర్కొంది. మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్ ప్రీమియం, క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్లు రూ.1 లక్ష వరకు, రూ.15 వేల వరకు చేసే రికరింగ్ ట్రాన్సాక్షన్లు ఇ-మ్యాండెట్‌ను తప్పనిసరి చేయాలని పేర్కొంది. పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినళ్ల వద్ద కాంటాక్ట్‌లెస్ విధనంలో కార్డుల ద్వారా చేసే చిన్న లావాదేవీలకు అథెంటికేషన్ మినహాయింపు కల్పించవచ్చని తెలిపింది. ఈ ముసాయిదాపై వచ్చే సెప్టెంబర్ 15 వరకు అభిప్రాయాలు తెలపాలని పేర్కొంది.