గచ్చిబౌలిలోని సిద్ధిఖీ నగర్‌లో నాలుగంతస్తుల భవనం మంగళవారం రాత్రి ఒకపక్కకు ఒరిగి భయాందోళన సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఆ భవనాన్ని అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. ఇదిలా ఉండగా.. భవనం పక్కన గుంతలు తవ్వి పక్కకు ఒరగడానికి కారణమైన బిల్డర్‌పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిల్డర్ శ్రీను అలియాస్ కల్వకోలు శ్రీను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా భవనం పక్కనే గుంతలు తవ్వి నిర్లక్ష్యంగా వ్యవహరించారని జీహెచ్‌ఎంసీ సిటీ ప్లానర్ వెంకటరమణ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం నుంచి G+4+పెంట్‌హౌజ్ భవనం కూల్చివేత పనులు చేపట్టగా.. రాత్రి 9గంటల సమయానికి పూర్తిగా నేలమట్టం చేశారు.
పరిహారం ఇప్పించండి: స్వప్న, భవన యజమాని
తమ బిల్డింగ్ పక్కనే మరో నిర్మాణానికి గుంతలు తవ్వడంతోనే భవనం పక్కకు ఒరిగిందని యజమాని స్వప్న అన్నారు. రెండేళ్ల క్రితం స్వగ్రామంలో పొలం అమ్మిన డబ్బులు, బ్యాంకు లోన్ తీసుకొని ఇల్లు నిర్మించామని చెప్పారు. మంగళవారం రాత్రి పక్కకి ఒరగడంతో అందులోని అందరం ఖాళీ చేశామని తెలిపారు. ‘‘భవనం కూలిపోతే చుట్టుపక్కల వారికి ఇబ్బంది కాబట్టి తొలగిస్తున్నారు. దాన్ని నేను అంగీకరిస్తాను. కానీ.. పక్క భవనం యజమానితో నష్టపరిహారం ఇప్పించండి. ఊరిలో పొలం అమ్మి అప్పు చేసి ఇల్లు కట్టాం. ఇది కోల్పోతే మా పిల్లల భవిష్యత్తేంటి? భవనం కూల్చివేతతో నాతోపాటు పిల్లలు రోడ్డున పడతారు’’ అని స్వప్న ఆవేదన వ్యక్తం చేశారు.
Amaravati News Navyandhra First Digital News Portal