తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వరుసగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో భాగంగా.. పలు పథకాలను అమలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. తాజాగా ప్రతిష్ఠాత్మకమైన రుణమాఫీ హామీని అమలు చేస్తోంది. ఆగస్టు 15లోపు రాష్ట్రంలోని అన్నదాతలందరికీ 2 లక్షల మేర రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఇప్పటికే రెండు విడతల్లో రుణాలు మాఫీ చేసిన సర్కార్.. ఇప్పుడు మూడో విడతకు సిద్ధమైంది. ఆగస్టు నెల పూర్తయ్యేలోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని విదేశీ పర్యటనకు ముందు రేవంత్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. అయితే.. ఆగస్టు 14 తేదీన విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రానున్న సీఎం రేవంత్ రెడ్డి.. 15వ తేదీన మూడో విడత రుణమాఫీ చేయనున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు.
ఇదిలా ఉంటే.. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురుచూస్తున్న సమయంలో.. ఈ పథకానికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసాను అమలు చేస్తామని.. ప్రతి రైతు ఖాతాలో 15 వేలు వేస్తామని ప్రకటించినప్పటికీ.. ఆ పథకం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.
అయితే.. రాష్ట్రంపై అప్పుల భారం, నిధుల సమస్య కారణంగా రైతు బంధునే రేవంత్ సర్కార్ అమలు చేస్తూ వస్తోంది. ఈ విషయంపై రైతుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. అయితే.. గత ప్రభుత్వంలో అమలైన రైతుబంధులో దొర్లిన అవకతవకలను సరిచేయటంతో పాటు.. రైతుభరోసాను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పథకం విధివిధానలపై నేరుగా రైతులతో చర్చించటంతోపాటు ప్రజాప్రతినిధులు అభిప్రాయాలను కూడా తీసుకుని.. పక్కాగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే.. రైతు భరోసాను రెండు దశల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావించినా.. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కూడా అయిపోతుండటంతో ఇప్పుడు ఒకే దశలో అమలు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఒకేసారి రైతుల అకౌంట్లలో 15 వేలు వేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. కేవలం రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది. మరోవైరు.. రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12 వేలు ఇస్తామని ప్రకటింది.
వీటన్నింటికీ భారీగా నిధులు అవసరమవగా.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆచీతూచి ముహూర్తం ఖరారు చేయనుంది. అయితే.. ఆగస్టు 15 తర్వాతే రైతు భరోసాపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటన చేయనుందన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే.. దీనిపై ప్రభుత్వ పెద్దలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవటం గమనార్హం. దీంతో.. వచ్చే సీజన్‌లోనే రైతు భరోసా డబ్బులు అకౌంట్లలో పడే అవకాశం ఉందని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.