కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా కేటాయింపులు జరిగాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలే కాకుండా.. ఇతర ప్రయోజనాలు కూడా కలగనున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కలిగే అదనపు ప్రయోజనాల వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు బడ్జెట్‌లో రూ.620 కోట్లు కేటాయించగా.. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.63 కోట్లు తగ్గింది. అలాగే విశాఖలో ఏర్పాటుచేసిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీకి రూ.168 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.78 కోట్లు పెంచడం విశేషం. ఈ విద్యాసంస్థ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేశఆరు.
విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌కు రూ.150 కోట్లు కేటాయించగా.. గతేడాది పోలిస్తే రూ.126 కోట్లు తక్కువ కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాజెక్టులకు మౌలిక వసతుల కల్పనకు వివిధ విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా నిధులు కేటాయించింది కేంద్రం. ఏఐఐబీ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల ప్రాజెక్టుకు రూ.150 కోట్లు, జపాన్ ప్రభుత్వం నుంచి ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు 2వ దశకు రూ.300 కోట్లు, ఐబీఆర్‌డీ నుంచి ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆపరేషన్‌కు రూ.300 కోట్లు, ఎన్‌డీబీ నుంచి ఆంధ్రప్రదేశ్ రహదారులు, వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టుకు రూ.650 కోట్లు కేటాయించారు. తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు కేంద్ర బడ్జెట్‌లో ఈసారి ప్రత్యేకంగా కేటాయింపులు లేవు. వాటి కేటాయింపులను సెంట్రల్ యూనివర్సిటీ గ్రాంట్లలో విలీనం చేయగా.. ఇకపై సెంట్రల్ యూనివర్సిటీల గ్రాంట్ల ద్వారానే గిరిజన వర్సిటీలకు నిధులు కేటాయిస్తారు.
కేంద్ర బడ్జెట్ ద్వారా వెంటిలేటర్‌పై ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన గుర్తింపు వచ్చిందని.. ఇది ప్రారంభం మాత్రమే అన్నారు. రాబోయే రోజుల్లో మరింత కష్టపడతామని.. రాష్ట్ర వనరులు, ఇబ్బందులు, అభివృద్ధి ప్రణాళికలు, సూపర్ సిక్స్ పథకాల గురించి బడ్జెట్‌లో వివరిస్తామని చెప్పారు. అమరావతికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం అందిస్తామంటూ కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన అంశాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పోలవరానికి సంబంధించి కేంద్రం క్లారిటీ ఇచ్చిందని.. తొందర్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్లలో పరిశ్రమల అభివృద్ధికి అదనపు నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాకూ వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధి కింద ఆర్థిక సాయంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి అన్ని విధాలా తోడ్పాటు ఇచ్చేలా ఉందన్నారు చంద్రబాబు. కేంద్రం నుంచి ఏపీకి ఏ రూంలో నిధులొచ్చినా అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.