ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితికి సంబంధించి అధికారులు, పోలీసులు కీలక సూచనలు చేశారు. సింగిల్ విండో ద్వారా గణపతి నవరాత్రి ఉత్సవాలకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. వినాయక చవితి మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. విగ్రహం ఎత్తు 5 అడుగులకు మించి ఉండకూడదని.. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలకూ అనుమతి ఉండదన్నారు. హుండీలు, విలువైన వస్తువులు ఉన్న చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని.. బలవంతంగా చందాలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. గణపతి విగ్రహాలను నిమజ్జనానికి తగిన అనుమతి తీసుకోవాలని సూచించారు.
అంతేకాదు విగ్రహాలతో పాటు మండపాల ఏర్పాటుకు ఐదుగురు, అంతకంటే ఎక్కువమంది ఒక కమిటీగా ఏర్పడి వివరాలను పోలీస్ స్టేషన్లో తెలియచేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని పోలీసులు సూచించారు. ప్రైవేటు, పంచాయితీ, మున్సిపాలిటీ స్థలాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకుంటే.. యజమాని, స్థానిక సంస్థల అనుమతి తీసుకోవాలన్నారు. అంతేకాదు అగ్నిమాపక, విద్యుత్ శాఖ అనుమతులతో మండపాల దగ్గర ఇసుక, నీరు ఉంచుకోవాలన్నారు. గణపతి ఉత్సవాలు నిర్వహించే రోజులు, నిమజ్జనం తేదీ, మార్గం వివరాలు కూడా తెలియజేయాలన్నారు.
గణపతి మండపాల దగ్గర ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే సౌండ్ బాక్సులు వినియోగించాలని సూచించారు పోలీసులు. గణపతి విగ్రహాలను రహదారులపై ఏర్పాటు చేయకూడదని.. బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టి ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించకూడదని సూచించారు. గణపతి మండపాల్లో ఊరేగింపుల సమయంలో అసభ్య ప్రదర్శనలు జరగకుండా చూడాలని.. నిమజ్జనం ఊరేగింపుకు కేటాయించిన మార్గంలోనే వెళ్లాలన్నారు. నిమజ్జనం సమయంలో మద్యం సేవించకూడదని.. అలాగే మండపాల దగ్గర ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదన్నారు. ఈ సూచనలు తప్పకుండా పాటించి పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా అల్లర్లకు, అసాంఘిక కార్యకలాపాలకు తావు ఇవ్వకూడదన్నారు. . శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఆయా ఉత్సవ కమిటీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటున్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు.