సన్యాసమా? పెళ్లా? మేము ఏదీ చెప్పం.. మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలకు సుద్గురు సమాధానం

తన కుమార్తెకు పెళ్లి చేసి జీవితంలో స్థిరపడేలా చేసిన సద్గురు జగ్గీవాసుదేవ్.. మిగతా మహిళలను సన్యాసినులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ఇటీవల మద్రాసు హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈశా ఆశ్రమంలో తన ఇరువురు కుమార్తెలకు బ్రెయిన్ వాష్ చేసి.. సన్యాసం స్వీకరించేలా ప్రోత్సహించారని ఆరోపిస్తూ కోయంబత్తూరుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.కామరాజ్ (69) హెబియస్ కార్పస్ పిటిషన్‌ దాఖలు చేయడంతో దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈశా ఫాండేషన్ వ్యవస్థాకులు, సద్గురు జగ్గీవాసుదేవ్‌ను ప్రశ్నించింది.

తాజాగా, హైకోర్టు ప్రశ్నలకు ఈశా ఫౌండేషన్ సమాధానం ఇచ్చింది. తాము పెళ్లిళ్లు చేసుకోమనిగానీ.. సన్యాసం స్వీకరించాలనిగానీ ఎవరికి సలహాలు ఇవ్వమని, ఎవర్నీ బలవంతం చేయమని స్పష్టం చేసింది. ఏది ఎంపిక చేసుకుంటారో యువత ఇష్టమని, ఇందులో మాది ఎలాంటి ప్రమేయం ఉండదని పేర్కొంది. ప్రజలకు యోగా, ఆధ్యాత్మికతను అందించడానికే ఈశా ఫౌండేషన్‌ను సద్గురు ఏర్పాటుచేశారని తెలిపింది.

‘‘ప్రజలకు యోగా, ఆధ్యాత్మికతను అందించడానికే ఈశా ఫౌండేషన్‌ను సద్గురు స్థాపించారు.. మానవులుగా యువతకు వారి మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ, జ్ఞానం ఉందని మేము నమ్ముతున్నాం… ఇవి వ్యక్తిగత ఎంపిక కాబట్టి మేము పెళ్లి చేసుకోమని లేదా సన్యాసం స్వీకరించమని ఎవరికీ సలహాలు ఇవ్వం.. బ్రహ్మచర్యం లేదా సన్యాసం తీసుకున్న కొద్దిమందితో పాటు సన్యాసులు కాని వేలాది మందికి ఈశా యోగా కేంద్రం నిలయంగా ఉంది’ అని ఈశా ఫౌండేషన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు, తమ ఆశ్రమంలో నివసించే సన్యాసులు ఇష్టపూర్వకంగా వారి జీవనశైలిని ఎంచుకున్నారని, దీని గురించి స్పష్టతనివ్వడానికి కోర్టు ముందు హాజరయ్యారని పేర్కొంది.

‘సన్యాసం తీసుకున్న తమ కుమార్తెలను కోర్టు ముందు హాజరుపరచాలని పిటిషనర్ కోరారు.. కోర్టు ముందు హాజరై తమ ఇష్టానుసారం ఈశా యోగా కేంద్రంలో ఉంటున్నామని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఈ అంశం కోర్టులో ఉన్నందున, నిజం గెలుస్తుందని మేము ఆశిస్తున్నాం.. అనవసరమైన కల్పిత వివాదానికి ముగింపు పడుతుందని భావిస్తున్నాం’ అని స్పష్టం చేసింది.

ఈశా ఫౌండేషన్‌కు సంబంధించి నిజనిర్ధారణ మిషన్ ముసుగులో పిటిషనర్, ఇతరులు తమ ప్రాంగణంలోకి చొరబడేందుకు గతంలో చేసిన ప్రయత్నాలను కూడా ఫౌండేషన్ హైలైట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈశా యోగా సెంటర్‌‌పై ఫిర్యాదులకు సంబంధించి పోలీసుల తుది నివేదికపై మద్రాసు హైకోర్టు స్టే ఇచ్చింది. అలాగే, ఇటీవల ఈశా కేంద్రంలో ఎస్పీ సహా పోలీసుల తనిఖీలపై కూడా స్పష్టతనిచ్చింది. ఇది కేవలం సాధారణ విచారణ అని.. ఇవేమీ సోదాలు కాదని పేర్కొంది. ఆశ్రమంలో ఉన్నవారు, వాలంటీర్లతో వారి జీవనశైలి గురించి ఇంటర్వ్యూలు మాత్రమే చేశారని వెల్లడించింది.

About amaravatinews

Check Also

PMO, పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటు చేయబోతున్న వేద గడియారం.. దీని ప్రత్యేకమేంటంటే

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఆధునిక వేద గడియారాలు తయారవుతున్నాయి. ఇవి హిందీ, ఇంగ్లీషులో మాత్రమే కాకుండా 189 భాషలలో సమయాన్ని తెలియజేస్తాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *