వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ విండోస్ (Microsoft Windows)లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక సేవలు తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించడంతో సిస్టంలు షట్‌డౌన్/రీస్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో క్రౌడ్ స్ట్రైక్ అప్‌డేట్ చేయడం వల్లే సాంకేతిక సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ విషయంపై తాజాగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) స్పందించారు. నిన్న క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్‌డేట్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్లలో సాంకేతిక సమస్య తలెత్తిందని తెలిపారు. సమస్యను గుర్తించి, దీనికి సంబంధించి క్రౌడ్ స్ట్రైక్ తో కలిసి పనిచేస్తున్నామన్నారు. వినియోగదారులకు అవసరమైన సాంకేతిక సహాయం, మద్దతు సమకూర్చేలా, సిస్టంలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సత్య నాదెళ్ల వివరించారు.
కాగా, మైక్రోసాఫ్ట్365 యాప్స్అండ్ సర్వీసెస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు, బ్యాంకులు, మీడియా సంస్థల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. వివిధ దేశాల్లో మైక్రోసాఫ్ట్ 365ను ఉపయోగిస్తున్న అనేక సంస్థలకు- తమ కంప్యూటర్లను యాక్సెస్ చేసే వీలు లేకుండా పోయింది. ఫలితంగా శుక్రవారం కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. విమానయాన సంస్థలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా వంటి విమానయాన సంస్థలతోపాటు వీసా, ఏడీటీ సెక్యూరిటీ, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్సర్వర్లలో సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బందిపడ్డాయి. ఆస్ట్రేలియాలో ప్రధాన మీడియా సంస్థలైన ఏబీసీ, స్కై న్యూస్టీవీ, రేడియో ప్రసారాలు కూడా నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు విమానాశ్రయాల్లో ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లు జారీ సహా ఇతర సేవలు అందించడానికి వీలు లేకుండా పోయింది. ఫలితంగా మాన్యువల్‌గా బోర్డింగ్ పాస్‌లు జారీ చేయాల్సి రాగా, ప్రయాణాలు ఆలస్యమయ్యాయి. భారత్‌లోని విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లు విండోస్ సమస్యపై మీమ్స్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఈ సమస్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు.