Cyclone Dana: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి.. అల్పపీడనంగా మారి క్రమంగా వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ఆ తర్వాత అతి తీవ్ర తుఫానుగా మారనుంది. దీనికి దానా తుఫాను అని ఇప్పటికే భారత వాతావరణ శాఖ పేరు పెట్టింది. ఇక ఈ దానా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఉండనుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈనెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 4 రోజుల పాటు పశ్చిమ బెంగాల్‌లో.. ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఒడిశాలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
ఈ దానా తుఫాన్ ఈనెల 24వ తేదీన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ దానా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఏపీ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటే సమయంలో మరింత భీకరమైన గాలులు, వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి తీర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ఈ దానా తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధం అయ్యాయి.
కాగా దానా తుఫాన్ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బెంగాల్‌లోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, పర్బా మందిర్, మేదినీపూర్, పశ్చిమ మిడ్నాపూర్, ఝాగ్రామ్, బంకూర, హుగ్లీ, హౌరా, కోల్‌కతా జిల్లాల్లోని స్కూళ్లకు బెంగాల్ ప్రభుత్వం 4 రోజుల పాటు సెలవులు ప్రకటించింది.
Amaravati News Navyandhra First Digital News Portal