Stock Market News: చిన్న, మధ్య తరహా కంపెనీల (SME IPO) ఐపీఓల్లో, షేర్లలో పెట్టుబడులకు సంబంధించి.. మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) మదుపరులకు వార్నింగ్ ఇచ్చింది. వీటిల్లో పెట్టుబడుల విషయంలో అత్యంత అప్రమత్తతతో ఉండాలని సూచించింది. సదరు కంపెనీలు.. తమ కార్యకలాపాలపై అవాస్తవాల్ని ప్రచారం చేసి.. షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచే ప్రయత్నం చేసే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. ఇటీవలి కాలంలో.. స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ అయిన తర్వాత.. కొన్ని SME సంస్థలు లేదా వాటి ప్రమోటర్స్.. తమ కార్యకలాపాలపై మదుపరుల నుంచి సానుకూల భావన వచ్చేలా.. ప్రచారం చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది సెబీ.
>> ముఖ్యంగా బోనస్ ఇష్యూలు, ప్రిఫరెన్షియల్ కేటాయింపు, షేర్ల విభజన వంటి ప్రకటనలు చేస్తున్నారని తెలిపింది సెబీ. దీంతో ఆ షేర్ల ధరలు పెరగ్గానే.. గరిష్ట ధరల దగ్గర ప్రమోటర్స్ తమ వాటాల్ని విక్రయించుకునేందుకు దీనిని ఒక అవకాశంగా మల్చుకుంటున్నట్లు వివరించింది సెబీ.
>> ఇలాంటి ప్రకటనలతో ఏదైనా కంపెనీ లేదా ప్రమోటర్స్ ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లయితే.. ఆ కంపెనీల్లో షేర్లు కొనేందుకు తొందరపడకుండా.. ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించింది సెబీ. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు, లిస్టింగ్ కాని సంస్థల సలహాలు/ ఊహాగానాలపై ఆధారపడి.. పెట్టుబడులు పెట్టవద్దని మదుపరులకు సలహా ఇచ్చింది.
>> ఇక ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ 2012లో ప్రారంభమైంది. వర్ధమాన వ్యాపార సంస్థలకు ప్రత్యామ్నాయ నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ వనరుగా మారింది. అప్పటినుంచి ఈ విభాగంలో పెట్టుబడులు పెరుగుతూ వచ్చాయి. కంపెనీల సంఖ్యా పెరుగుతుంది. మదుపరుల్లో ఆసక్తి కూడా పెరుగుతోంది. గత పదేళ్ల వ్యవధిలో చూస్తే ఈ ప్లాట్‌ఫాం ద్వారా రూ. 14 వేల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. రూ. 6 వేల కోట్లు ఇందులో 2024 ఆర్థిక సంవత్సరంలోనే రావడం గమనార్హం.
ఇక ఇటీవలి కాలంలో వస్తున్న ఎస్ఎంఈ ఐపీఓలు మంచి లిస్టింగ్ గెయిన్స్ కూడా ఇస్తున్నాయి. తాజాగా రెండే విక్రయ కేంద్రాలు, 8 మంది సిబ్బంది ఉన్న రీసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ ఐపీఓ రూ. 12 కోట్ల నిధుల సమీకరణ కోసం వెళ్తే.. ఏకంగా రూ. 4800 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా సెబీ కీలక సూచనలు చేసింది.