తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపికబురు చెప్పింది. రెండు రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణానికి సంబంధించి.. రెండు ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణం తగ్గనుంది. విశాఖపట్నం-శంషాబాద్ (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్‌మెంట్ ఖాయమైంది. ఈ మార్గాన్ని సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ ప్రతిపాదన చేశారు. అలాగే విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది విశాఖపట్నం నుంచి మొదలై.. సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ మీదుగా కర్నూలు వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్ (పెట్) సర్వే తుది దశకు వచ్చింది.. ఈ సర్వే రిపోర్ట్ నివేదికను నవంబరులో రైల్వేబోర్డుకు సమర్పించనున్నారు.
ఈ హైస్పీడ్ కారిడార్ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిది.. ఈ మార్గంలో శంషాబాద్, రాజమహేంద్రవరం విమానాశ్రయాలను కూడా అనుసంధానించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే విమాన ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య రైలు ప్రయాణానికి 12 గంటల సమయం పడుతోంది.. అదే వందేభారత్ 8.30 గంటల్లో వెళుతుంది. ఈ సెమీ హైస్పీడ్ కారిడార్‌లో గంటకు 220 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు. ఈ కారిడార్ పూర్తయితే.. హైదరాబాద్ (శంషాబాద్) ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నానికి నాలుగు గంటల్లోపే చేరుకోవచ్చు.