Senior Citizens FD Rates: ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్లను 6.50 శాతం వద్ద గరిష్ట స్థాయిలో ఉంచింది. చాలా కాలంగా స్థిరంగానే ఉంటున్నాయి. త్వరలో ద్రవ్యోల్బణం తగ్గితే దీనిని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అయితే రెపో రేటు ఎక్కువగా ఉంటే.. బ్యాంకులు లోన్ వడ్డీ రేట్లు పెంచుతుంటాయి. మరోవైపు ఫిక్స్‌డ్ డిపాడిట్లపైనా అధిక వడ్డీ అందిస్తుంటాయి. ఇప్పుడు చాలా బ్యాంకుల్లో ఆకర్షణీయ స్థాయిలోనే వడ్డీ రేట్లు ఉన్నాయి. సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజెన్లకు ఇంకాస్త ఎక్కువ వడ్డీనే వస్తుంది. సాధారణంగా 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ ఎక్కువ ఉంటుంది. బ్యాంకుల్ని బట్టి వడ్డీ రేట్లు మారుతుంటాయి. ఇంకా ప్రభుత్వ, ప్రైవేట్ ప్రముఖ బ్యాంకులతో పోలిస్తే.. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మంచి వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంటాయి.
అందుకే మనం ఇప్పుడు సీనియర్ సిటిజెన్లకు అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల గురించి చూద్దాం. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో దాదాపు అన్నింట్లోనూ 9 శాతానికిపైనే వడ్డీ వస్తోంది. దేంట్లో 10 లక్షలు జమ చేస్తే.. వడ్డీ ఏయే టెన్యూర్లపై ఎంత వస్తుందనేది చూద్దాం.
అత్యధికంగా నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సీనియర్ సిటిజెన్స్‌కు 9.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. నార్త్ ఈస్ట్ బ్యాంకు 546-1111 రోజులపై కాగా.. యూనిటీ బ్యాంకు 1001 రోజుల డిపాజిట్‌పై అత్యధిక వడ్డీ ఇస్తుంది. ఇందులో వరుసగా 1111 రోజులకు, 1001 రోజులకు 10 లక్షలపై వడ్డీ ఎంతొస్తుందో చూద్దాం. 1111 రోజులకుగానూ 10 లక్షలపై రూ. 2,89,100 వడ్డీ వస్తుంది. అదే 1001 రోజులపై యూనిటీ బ్యాంకులో రూ. 2,61,252 వడ్డీ అందుతుంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు అత్యధికంగా 9.10 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇది రెండేళ్ల నుంచి మూడేళ్ల డిపాజిట్లతో పాటుగా.. 1500 రోజుల డిపాజిట్‌పైనా ఉంది. మూడేళ్ల ఎఫ్‌డీపై 10 లక్షలు జమ చేస్తే రూ. 2,68,462 వడ్డీ వస్తుంది.