ఏడేళ్ల బాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా స్కూల్‌కు వెళుతూ అరుదైన ఘనతను దక్కించుకుంది.. సరికొత్త రికార్డుల్ని అందుకుంది. ఐదున్నర నెలలకే పుట్టి.. మూడున్నరేళ్ల వయసు వరకు ఒక గదిలోనే చికిత్స తీసుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టించింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మస్తాన్‌వలి కారు డ్రైవర్ కాగా.. కేరళకు చెందిన షీబాను వివాహం చేసుకున్నారు. షీబా 2017లో గర్భం దాల్చిన ఐదో నెలలోనే అయత్ ఇశ్రాయెల్ జిబ్రిల్ అనే పాపకు జన్మనిచ్చారు. పుట్టినప్పుడు బిడ్డ బరువు 500 గ్రాములే ఉండటం, అవయవాలు పూర్తిగా రూపుదాల్చలేదు. పాప శరీరమంతా వెంట్రుకలతో ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళనచెందారు.
చిన్నారికి వివిధ వైద్య పరికరాల సాయంతో ప్రత్యేక గదిలో మూడున్నరేళ్ల వయసు వరకు వైద్యం అందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకున్నారు. పాప వైద్యానికి దాదాపుగా రూ.25 లక్షలు ఖర్చు అయ్యింది. చిన్నారి ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో.. ఐదేళ్ల వయసులో అయత్ కేరళలోనే ఎల్‌కేజీలో చేరింది. పాప తన అనారోగ్య సమస్యల కారణంగా ఎప్పుడూ మాస్క్‌తో ఉంటూ, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
అంతేకాదు అయత్ ఇతర విద్యార్థులకు దూరంగా ఉండేది.. చిన్నారి 2023-24లో 197 రోజుల పాటూ స్కూల్లో క్లాసులు నిర్వహించారు. అయత్ అన్నిరోజులూ స్కూలుకు హాజరయ్యింది.. పాప అలా వెళ్లినందుకు ఇప్పటి వరకు ప్రతిష్ఠాత్మక అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(యూకే), ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఎప్పటికైనా తాను పాటలు పాడుతూ టీవీలో కనిపించడం తన లక్ష్యమని అయత్ చెబుతున్నారు.
చిన్నారులు ఎవరైనా స్కూలుకు వెళ్లాలంటే ఏదో వంక చెప్పి డుమ్మా కొడుతుంటారు. కానీ అయత్ మాత్రం అలా కాదు తనకు ఆరోగ్యం సహకరించకపోయినా సరే చదువును నిర్లక్ష్యం చేయలేదు.. ఐదున్నర నెలలకే పుట్టి మూడున్నరేళ్ల వయసు వరకు ఒక గదిలోనే చికిత్స తీసుకుంది. ప్రతి రోజూ స్కూల్‌కు వెళుతూ.. హాజరులో రికార్డులు సృష్టిస్తోంది.