Cyclone Dana: తీవ్ర తుఫానుగా తీరం దాటిన ‘దానా’..ఒడిశా, బెంగాల్‌లో పెను విధ్వంసం

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తీవ్ర తుఫాన్‌ (Cyclone Dana) గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటింది. ఒడిశాలోని బిత్తర్‌కనిక‌లోని హబలిఖాటి జాతీయ పార్క్‌, ధమ్రా మధ్య అర్ధరాత్రి 1.30 నుంచి మొదలైన ఈ ప్రక్రియ.. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు కొనసాగినట్టు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తీరం దాటిన ‘దానా’ శుక్రవారం ఉదయం 12 గంటల వరకు తీవ్ర తుఫానుగా కొనసాగి తర్వాత బలహీనపడి తుఫానుగా మారుతుందని, సాయంత్రానికి మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా, రాత్రికి వాయుగుండంగా మారుతుందని తెలిపింది.

ప్రస్తుతం పరాదీప్‌కు 60 కి.మీ., ధమ్రాకు 20 కి.మీ, పశ్చిమ్ బెంగాల్‌లోని సాగర్ దీవికి 150 కి.మీ. దూరంలో కేంద్రకృతమై ఉంది. క్రమంగా పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి క్రమంగా బలహీనపడుతుందని ఐఎండీ వెల్లడించింది. అయితే, తీరం దాటిన సమయంలో భద్రక్‌, కేంద్రపర జిల్లాల్లో గంటకు 120 కి.మీ వేగంతో తీవ్రంగా గాలులు వీచాయి. ప్రచండ గాలుల ధాటికి ఎక్కడికక్కడ చెట్లు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇక, శుక్రవారం సాయంత్రం వరకు దానా ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని శనివారం వరకు వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు.

తుపాన్‌ ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని ఐఎండీ అధికారులు రెండు రాష్ట్రాలకు సూచించారు. గురువారం సాయంత్రం మూసివేసిన కోల్‌కతా, భువనేశ్వర్‌ ఎయిర్‌పోర్ట్‌‌లు శుక్రవారం 9 గంటల తర్వాత తెరిచే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లో మొత్తం 400 రైళ్లను రద్దు చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలో 7 వేల పునరావాసన కేంద్రాలను ఏర్పాటుచేసి 6 లక్షల మందిని తరలించారు. తొలుత 15 నుంచి 18 లక్షల మందిని తరలించాలని భావించినా.. తుఫాను తీవ్రత తక్కువగా ఉండటంతో కుదించారు.

శుక్రవారం జగత్సింగ్‌పూర్, కేంద్రపడ, కటక్, భద్రక్, జాజ్‌పూర్, బాలేశ్వర్, మయూర్‌భంజ్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు (20 సెంటీమీటర్ల చొప్పున) కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న పూరీ, ఖుర్దా, కేంఝర్, నయాగఢ్, ఢెంకనాల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్, గంజాం, బౌద్ధ్, అనుగుల్, దేవ్‌గఢ్, సంబల్‌పూర్, ఝార్సుగుడ, సుందర్‌గఢ్, కొంధమాల్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్న అంచనాతో ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. దానా ప్రభావంతో శనివారం వరకు రాష్ట్రంలో వర్షాలకు అవకాశం ఉందని దాస్‌ చెప్పారు.

ఇక, దానా తుఫాను ప్రభావం పశ్చిమ్ బెంగాల్‌లోని తొమ్మిది జిల్లాలపై ఉంది. పశ్చిమ, తూర్పు మిడ్నాపూర్, ఝార్‌గ్రామ్‌, హౌరా, హుగ్లీ, కోల్‌కతా, బంకుర జిల్లాలున్నాయి. దిఘా పర్యాటక ప్రాంతంలో రెడ్‌ ఎలెర్ట్‌ జారీ చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని 2.5 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల్లోని మొత్తం 3.5 లక్షల మందిని గుర్తించామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఆమె సెక్రటేరియట్‌లోనే మకాం వేసి రాత్రంతా పరిస్థితిని పర్యవేక్షించారు.

About amaravatinews

Check Also

కార్తీక పౌర్ణమి రోజున ఈ రెమెడీస్ చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదల వర్షం కురుస్తుంది..

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక పూర్ణిమ రోజున గంగాస్నానం చేయడం విశేషంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *