కలియుగ వైకుంఠం తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వారిలో కొంతమంది సొంత వాహనాల్లో కొండపైకి చేరుకుంటే.. మరికొంత మంది ఆర్టీసీ బస్సు్ల్లో తిరుమల వస్తుంటారు. ఇక చాలా మంది భక్తులు నడకమార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. నడకమార్గంలో వచ్చే భక్తులలో చాలా మంది అలిపిరి నడక మార్గాన్ని ఎంచుకుంటే.. మరికొంత మంది శ్రీవారి మెట్టు గుండా కొండపైకి వస్తుంటారు. అయితే అటవీ ప్రాంతం కావటంతో అప్పుడప్పుడూ భక్తులు వెళ్లే నడకమార్గంలోకి వన్యప్రాణులు ప్రవేశిస్తుంటాయి. చిరుతలు, ఎలుగుబంట్లు నడకదారిలో కలకలం రేపాయనే వార్తలు వస్తూనే ఉంటాయి.
అయితే శనివారం నడక మార్గంలో ఓ పాము కలకలం రేపింది. నడకమార్గం గుండా తిరుమల వెళ్తున్న భక్తుడిని కాటేసింది. చీరాలకు చెందిన కొంతమంది భక్తులు అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు వెళ్తున్నారు. అయితే ఏడో మైలు వద్దకు రాగానే సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి మెట్లపైకి చేరుకున్న పాము.. నాగేంద్ర అనే భక్తుడిని కాటేసింది. మెట్లపై విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పాము కాటేసి పారిపోయింది.. దీంతో శ్రీవారి భక్తులంతా ఉలిక్కిపడ్డారు. భయంతో హాహాకారాలు చేశారు భక్తులు ఇచ్చిన సమాచారంతో అటవీ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. భక్తుణ్ని తిరుమలలోని ఆస్పత్రికి తరలించారు.
అయితే భక్తుడిని కాటేసిన పాము.. విషపూరితమైనది కాకపోవటంతో ప్రమాదం తప్పింది. అంబులెన్సులో వెంటనే ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స చేశారు. ఎలాంటి అపాయం లేదని స్పష్టం చేశారు. మరోవైపు తిరుమలలో వన్యప్రాణుల సంచారం కొత్తేమీ కాదు. అప్పుడప్పుడూ నడకమార్గం దగ్గరకు చిరుతలు, ఎలుగుబంట్లు కూడా వచ్చిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. మరీ ముఖ్యంగా లక్షిత అనే చిన్నారిపై చిరుతపులి దాడి ఘటన తర్వాత.. దీనిపై పెద్దఎత్తున చర్చ జరిగింది. భక్తుల భద్రత కోసం అప్పట్లో టీటీడీ చేతి కర్రలు కూడా పంపిణీ చేసిన పరిస్థితి. వరుసగా చిరుతలు కనిపించడంతో అప్పట్లో శ్రీవారి భక్తులు బెంబేలెత్తిపోయారు. అయితే టీటీడీ చర్యలతో ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తగ్గాయి.