అనంతపురం జిల్లాలో రామాలయంలో రథానికి నిప్పు పెట్టిన ఘటన కలకలంరేపింది. కనేకల్ మండలం హనకనహాల్‌లో రామాలయం ఉంది.. అక్కడ మంగళవారం అర్ధరాత్రి రాముడి రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా.. స్థానికులు గమనించి మంటల్ని ఆర్పేశారు. కానీ అప్పటికే రథం సగానికి పైగా కాలిపోయింది. పుణ్యతిథులు, ఉత్సవాల సమయంలో రాములవారిని రథంపై ఊరేగిస్తుంటారు. మిగతా సమయంలో ఓ షెడ్డులో రథాన్ని భద్రపరుస్తారు.
రథానికి నిప్పు పెట్టారనే సమాచారం అందుకున్న కళ్యాణదుర్గ డీఎస్పీ రవిబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్రిమినల్ కేసు నమోదు చేసి.. క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్ సాయంతో ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో పలు ఆధారాలు దొరికినట్లు చెబుతున్నారు.. వాటి ఆధారంగా నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టారు. ఘటనాస్థలం దగ్గర బీజేపీ,భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రథానికి నిప్పు పెట్టిన దుండగలను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటనపై తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని.. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుని శిక్షించాలని ఆదేశించారు. ఇలాంటి అరాచకాలకు పాల్పడేవారిని తమ ప్రభుత్వం వదిలిపెట్టబోదని చంద్రబాబు హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.