శ్రీశైలం మల్లన్నకు హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. శుక్రవారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. శ్రీశైలం ప్రధాన ఆలయంలోని చంద్రావతి కల్యాణమండపంలో భక్తులు గత 29 రోజులుగా సమర్పించిన ఈ హుండీ లెక్కింపును నిర్వహించారు. హుండీ ద్వారా దేవస్థానానికి రూ.3,31,70,665 నగదు లభించింది. అలాగే 127 గ్రాముల బంగారం, 4.400 కిలోల వెండి ఉన్నాయి. 4,445 యూఏఈ దిర్హమ్స్, 489 అమెరికా డాలర్లు, 5 లక్షల విలువైన వియత్నాం డాంగ్స్, 108 ఖతార్ రియాల్స్, 90 థాయిలాండ్ బట్స్, 20 ఇంగ్లాండ్ పౌండ్స్ వంటి విదేశీ కరెన్సీ కూడా హుండీ ద్వారా లభించింది. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, డిప్యూటీ ఈవో రమణమ్మ, శివసేవకులు ఉన్నారు.
మరోవైపు శ్రీశైలం ఆలయంలో ఓ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరైన ఘటన కలకలంరేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ఈవో పెద్దిరాజు సీరియస్‌గా తీసుకున్నారు. శ్రీశైల దేవస్థానంలో క్యూలైన్ల నిర్వహణ సహాయ కార్యనిర్వాహణాధికారి జి.స్వాములు, ఇంఛార్జ్ గంజి రవిని సస్పెండ్ చేశారు. క్యూలైన్లలో విధులు నిర్వర్తించే పొరుగుసేవల సిబ్బంది మద్యం తాగి భక్తులతో దుర్భాషలాడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో స్పందించిన ఈవో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు ఈ ఘటనకు కారణమైన పొరుగుసేవల సిబ్బంది పి.నాగేంద్రంను విధుల నుంచి తొలగించారు.
Amaravati News Navyandhra First Digital News Portal