లక్షలాదిమంది రైతులకు గుడ్‌ న్యూస్‌ అంటోన్న కాంగ్రెస్‌ సర్కార్‌

లక్షలాదిమంది రైతులకు గుడ్‌ న్యూస్‌ అంటోంది తెలంగాణలోని కాంగ్రెస్‌ సర్కార్‌. తెలంగాణలో ఏప్రిల్ 14, సోమవారం నుంచి భూ భారతి చట్టం అమల్లోకి రాబోతుంది. ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌ కూడా అందుబాటులోకి రానుంది. ప్రజల నుంచి వచ్చే సూచనలు, సలహాలతో పోర్టల్‌ను మరింత పటిష్టంగా రూపొందించాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు.

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది. ఆర్వోఆర్‌-2020 స్థానంలో ఆర్వోఆర్‌-2025 భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమల్లోకి తీసుకురానున్నారు. దీంతోపాటు ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌ సైతం అందుబాటులోకి రానుంది. మొదట మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తారు. ఈ నెల 14న అంబేద్కర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కొత్త చట్టం, పోర్టల్‌ను ఆవిష్కరించేందుకు రెవెన్యూశాఖ ఏర్పాట్లు చేసింది. కొత్త చట్టం అమలు, నియమ నిబంధనలపై అదే రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

భూ భారతితో గందరగోళానికి ఫుల్‌స్టాప్‌

గందరగోళానికి తావు లేకుండా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల పోర్టల్‌ భూ భారతిని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తోంది. గతంలో ధరణిలో 33 మాడ్యూళ్లు ఉన్నాయి. రైతులు పోర్టల్లో దరఖాస్తు చేసే సమయంలో ఒకదానికి బదులు మరొక మాడ్యూల్‌ను ఎంపిక చేస్తే తిరస్కారానికి గురికావడమో, లేదంటే సమస్య పరిష్కారం కాకపోవడమో జరిగేది. ఈ గందరగోళానికి ముగింపు పలికేలా కొత్త పోర్టల్‌లో మాడ్యూళ్ల సంఖ్యను ఆరుకు కుదించారు. వారసత్వ బదిలీ సమయంలో కుటుంబ సభ్యులందరికీ తెలిసేలా నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ చేపట్టే వ్యవస్థ కూడా అందులో ఉంది. దీంతోపాటు ఈ-పహాణీని 11 కాలమ్‌లతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ధరణిలో కేవలం భూ యజమాని పేరుతో మాత్రమే పహాణీ ఉండేది. దాని స్థానంలో యజమాని పేరు, భూ ఖాతా, సర్వే నంబరు, అనుభవదారు లేదా పట్టాదారు, ప్రభుత్వ భూమి లేదా పట్టా భూమి, వారసత్వంగా వచ్చిందా, కొనుగోలు ద్వారా వచ్చిందా తదితర వివరాలు తెలిపేలా పహాణీ ఉండనుంది.

సామాన్యులకు కూడా అర్థం అయ్యేలా భూ భారతి

భూ భారతిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. సామాన్య రైతుకు కూడా భూ భారతి అర్థం అయ్యేలా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం. నిర్వహణ బాధ్యతలను మంచి సంస్థకు అప్పగించాలని, కనీసం వందేళ్లపాటు వెబ్‌సైట్ ఉంటుందన్నారు రేవంత్‌. భద్రతాపరమైన సమస్యలు రాకుండా చూడాలన్నారు ఆయన. అవగాహనా సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లకు సీఎం ఇప్పటికే ఆదేశం జారీ చేశారు.

జూన్‌ 2నాటికి రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి

ఇక భూ భారతిని రాష్ట్రం అంతటా ఒకేసారి అమలు చేస్తే తప్పులు సరిచేయడం ఇబ్బందిగా ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. పైలెట్‌ ప్రాజెక్టు అమలు చేసే గ్రామాల్లో, సమస్యలపై మాన్యువల్‌గా అప్లికేషన్ తీసుకుంటామన్నారు మంత్రి. హైదరాబాద్ నుంచి అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. పైలెట్‌ ప్రాజెక్టుతో సమస్యలను పరిష్కరించాక, జూన్‌ 2నాటికి తెలంగాణ వ్యాప్తంగా భూ భారతిని అమల్లోకి తీసుకురానున్నారు.

About Kadam

Check Also

ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు వచ్చేశాయ్..

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు 2025 మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలయ్యాయి. నాంపల్లిలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *