ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు మండలం గారపాడులో స్థానికులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. అందరూ అంత సంతోషం వ్యక్తం చేసే సందర్భం ఏంటా అనుకుంటున్నారా..? పెద్ద కథే ఉంది.. దేవుడి గుడిలో మాయమైన విగ్రహాలు.. అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాయి.. ఎలా అనుకుంటున్నారా..? అయితే.. ఈ మొత్తం కథ తెలుసుకోండి.
రెండు రోజుల క్రితం గ్రామంలోని మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పూజలు చేసేందుకు ఎప్పటిలాగే పూజారి వచ్చారు. గుడిలోకి అడుగుపెట్టిన పూజారి ఆశ్చర్యపోయారు. గుడిలోని హుండీ పగల కొట్టి ఉండటంతో దొంగతనం జరిగిందని భావించారు. అదే సమయంలో గర్భ గుడిలోకి వెళ్లి చూడగా హుండీ పగుల కొట్టి డబ్బులు అపహరించినవారే పంచలోహ విగ్రహాలను కూడా తీసుకెళ్లారు. ఈ విషయాన్ని వెంటనే పూజారి స్థానిక పెద్దలకు చెప్పారు. అందరూ ఆలయం వద్దకు వచ్చి పరిశీలించిన తర్వాత పెదకూరపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూల విరాట్‌తో పాటు పంచలోహ ఉత్సవ విగ్రహాలను స్థానికులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే పంచ లోహ విగ్రహాలను అపహరించుకుపోవడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అయింది. ఎంతో భక్తితో చేయించుకున్న విగ్రహాలను దొంగలించిన దొంగలను పట్టుకొని శిక్షించాలని స్థానికులు పోలీసులకు కోరుకున్న వారు కొందరైతే.. ఇక పోయిన విగ్రహాలు దొరకటం కల అనుకున్న వారు మరికొందరు.. ఇలా గ్రామం మొత్తం ఆలయంలో జరిగిన దొంగతనం గురించి చర్చించుకుంటున్న సమయంలోనే ఒక విచిత్రం చోటు చేసుకుంది.
సోమవారం రాత్రి ఆలయంలో దొంగలు పడి విగ్రహాలను దొంగలించుకు పోతే మంగళవారి అర్ధరాత్రి సమయానికి ఉత్సవ విగ్రహాలు గుడి ముందు రోడ్డు పక్కన ప్రత్యక్ష మయ్యాయి. ఈ విషయం స్థానిక పెద్దలకు తెలియడంతోనే వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయం వద్దకు వచ్చి పోలీసులు విగ్రహాలను పరిశీలించి వాటిని ఆలయం లోపలకు చేర్చారు. అయితే ఇరవై నాలుగు గంటల్లోనే విగ్రహాలు గుడి ముందు ప్రత్యక్ష కావడం స్వామి మహిమే అని స్థానికులు అంటున్నారు.
అయితే.. పోయిన విగ్రహాలు ఇక దొరకవనుకుంటున్న సమయంలోనే గుడి ముందే ప్రత్యక్ష కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అయితే స్థానిక పెద్దలు మాత్రం అసలు దొంగలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఫింగర్ ప్రింట్ ఆధారాలు సేకరించి అసలు దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా తమ గ్రామానికి చెందిన విగ్రహాలు తిరిగి వచ్చాయి అంతే చాలు.. ఇక ఆలయ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు పేర్కొంటున్నారు.