ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆక్రమణల పేరుతో ఇళ్లు కూల్చివేతలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రికిరాత్రే బుల్డోజర్లు పంపి అక్రమ నిర్మాణాల పేరుతో నివాసాలు కూల్చివేయజాలదని స్పష్టం చేసింది. కేవలం 3.7 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించారనే సాకుతో ఇంటిని కూల్చి వేసినందుకు బాధితుడికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని యోగి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు బాధ్యులైన అధికారులపై విచారణ చేపట్టాలని సూచించింది.
ఈ క్రమంలో రహదారి విస్తరణ సమయంలో ఎలా వ్యవహరించాలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. నాలుగేళ్ల కిందట 2020 నవంబరు 7న యూపీలోని మహరాజ్‌గంజ్‌కు చెందిన మనోజ్ తిబ్రేవాల్ ఆకాశ్ అనే వ్యక్తి.. రోడ్డు విస్తరణ పేరుతో.. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని తన ఇంటిని కూల్చి వేశారని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కనీసం నోటీసు ఇవ్వకుండానే రాత్రికి రాత్రి కూల్చివేశారని వాపోయాడు. ఈ పిటిషన్‌పై తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ జరిపింది.