దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 9న బెయిల్ కోరుతూ ఆమె తరుపు న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. ఈ మేరకు వాదనలు విన్న న్యాయస్థానం ఈ సమయంలో కవితకు మద్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
ప్రతివాదుల వాదనలు వినకుండా మద్యంతర బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రతివాదులైన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలకు కౌంటర్ దాఖలు చేయాలంటూ సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో కవిత తరఫు లాయర్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు నోటీసులు ఇచ్చిన తర్వాత సోమవారం విచారించాలని ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. గత ఐదు నెలలుగా కవిత తీహార్ జైలులోనే ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీబీఐ, ఈడీ కేసుల్లోనూ ఛార్జిషీట్లు దాఖలయ్యాయనే విషయాన్ని కోర్టు ముందుంచారు.
ఇప్పటి వరకు కేసులో 493 మంది సాక్షుల విచారణ జరగిందన్నారు. మహిళగా సెక్షన్ – 45 ప్రకారం కవిత మద్యంతర బెయిల్‌కు అర్హురాలని వాదనలు వినిపించారు. అయితే కవిత తరుపు న్యాయవాది వాదనలను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రస్తుతం బెయిల్ ఇవ్వటం కుదరదని స్పష్టం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు నోటీసులు జారీ చేస్తూ.. ఈ నెల 20న కేసుపై తిరిగి విచారణ చేపడతామని వాయిదా వేసింది.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ ఏడాది మార్చిలో ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. సీబీఐ కూడా అభియోగాలు మోపింది. సీబీఐ ఛార్జిషీటులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం పాలసీ రూపకల్పనలో కవితే.. ప్రధాన సూత్రధారిగా సీబీఐ రిపోర్టులో వెల్లడించింది. లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా మద్యం పాలసీని తయారు చేశారని ఆరోపించారు. అందుకు సౌత్ గ్రూప్ నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందినట్లుగా సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.
సుమారు రూ.100 కోట్ల ముడుపులు అక్రమంగా సేకరించి విజయ్ నాయర్ ద్వారా ఆప్ పార్టీకి బదాలయించినట్లు సీబీఐ ఆరోపించింది. దీంతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించగా.. ప్రస్తుతం ఆమె తిహార్ జైలులో ఉన్నారు. ఇటీవల ఆగస్టు 13 వరకు న్యాయస్థానం ఆమె కస్టడీని పొడగించింది.