ఈశా ఫౌండేషన్‌పై తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేయడంతో మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఈశా యోగా కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఊరట లభించింది. ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసులకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అలాగే స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం ఆదేశాలు వెలువరించింది.
తన కుమార్తెకు వివాహం చేసి.. జీవితంలో స్థిరపడేలా చేసిన ఈశా ఫౌండేషన్ వ్యవస్థాకులు సద్దుగు జగ్గీవాసుదేవ్.. ఇతర మహిళలను మాత్రం సన్యాసినులుగా జీవించాలని ప్రోత్సహిస్తున్నారని ప్రొఫెసర్ ఆరోపించారు. తన ఇద్దరు కమార్తెలను పదేళ్లుగా ఆశ్రయంలో బంధించారని, తమతో సంబంధాలు లేకుండా చేశారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన చేసిన హెబియస్ కార్పస్ రిట్‌ను హైకోర్టు నుంచి సుప్రీం ధర్మాసనం ముందుకు బదిలీ చేసింది. ఈశా ఫౌండేషన్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహిత్గీ, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. ఉత్తర్వులు జారీ చేసే ముందు హైకోర్టు మరింత ఆలోచించాల్సిందని అభిప్రాయపడ్డారు.
ప్రొఫెసర్ కుమార్తెల్లో ఒకరు సుప్రీంకోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు. తాము ఇష్టపూర్వకంగానే ఈశా యోగా కేంద్రంలో ఉన్నామని, ఇందులో ఎవరి బలవంతం, ఒత్తిడి లేదని పేర్కొంది. మా తండ్రి ఈ వేధింపులు గత 8 ఏళ్లుగా కొనసాగుతున్నాయని హైకోర్టు న్యాయమూర్తికి కూడా చెప్పామని అన్నారు.