MK Stalin: ప్రతీ జంట 16 మంది పిల్లల్ని కనండి.. చంద్రబాబు వ్యాఖ్యలకు స్టాలిన్ మద్దతు

MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన స్టాలిన్.. ప్రతీ ఒక్కరు 16 మంది పిల్లలను కనాలనే ఆలోచనతో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేశాయని.. అయితే దాని వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయి, లోక్‌సభ నియోజకవర్గాలు కూడా తగ్గుతున్నాయని తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ.. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిపోతోందని.. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల్లో కేటాయింపులో కోత పడొచ్చన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ.. స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

తిరువాన్మియూర్‌లోని మరుంధీశ్వరార్ ఆలయ కళ్యాణ మండపంలో రాష్ట్ర హిందూ మత, ధర్మాదాయ శాఖ సోమవారం నిర్వహించిన సామూహిక జంటల కల్యాణోత్సవానికి సీఎం ఎంకే స్టాలిన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన స్టాలిన్.. జనాభా నియంత్రణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా పెళ్లయిన జంటలు 16 రకాల ఆస్తులను పొందాలని పూర్వ కాలంలో పెద్దలు ఆశీర్వాదించేవారని.. ఇప్పుడు ఆస్తికి బదులుగా 16 మంది పిల్లలను కనాలని, వారు ఆనందంగా జీవించాలని దీవించండి అంటూ స్టాలిన్ పేర్కొన్నారు. జనాభా నియంత్రణ కారణంగా రాష్ట్రాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతోందని.. పరిస్థితులకు తగ్గట్టుగా మనం మారాలని తెలిపిన స్టాలిన్.. ప్రతి ఒక్కరూ 16 మంది పిల్లలను కనాలని సూచించారు.

అయితే జనాభా నియంత్రణ గురించి.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేయడం విశేషం. జనాభా సమతుల్యత, వృద్ధాప్య జనాభా పెరుగుతుండటంపై చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు సూచించారు. ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించే చట్టాన్ని తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు.

About amaravatinews

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *