Kamala Harris: నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ తరఫున భారత సంతతికి చెందిన కమలా హారిస్ బరిలో ఉండగా.. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో 3, 4 రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిదో తేలిపోనుంది. ఈ ఎన్నికల్లో కమలా హరిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతుండటంతో.. ఎవరు గెలుస్తారనేది అన్ని దేశాల్లో తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కమలా హారిస్ పూర్వీకుల గ్రామం అయిన మన దేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తులసేంద్రపురంలో మాత్రం ఇప్పటికే సంబరాలు ప్రారంభం అయ్యాయి. తులసేంద్రపురం మొత్తం కమలా హారిస్ ఫ్లెక్సీలతో నిండిపోయింది. అంతేకాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలవాలని తులసేంద్రపురంలో పూజలు నిర్వహిస్తున్నారు.
కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు. శ్యామల తండ్రి గోపాలన్ తమిళనాడులోని తులసేంద్రపురంలో పుట్టారు. గోపాలన్ భారత ప్రభుత్వ అధికారిగా పలు హోదాల్లో పని చేశారు. కమలా హారిస్ తల్లి శ్యామల గోపాలన్.. 19 ఏళ్ల వయసులో ఉన్నపుడు పై చదువుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లారు. అక్కడ శ్యామలా గోపాలన్ రొమ్ము క్యాన్సర్‌పై అనేక పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్‌ను శ్యామల గోపాలన్ పెళ్లి చేసుకున్నారు. డొనాల్డ్ హారిస్, శ్యామల గోపాలన్‌లకు పుట్టిన తొలి బిడ్డనే కమలా హారిస్. తాను చిన్నతనంలో ఉన్నపుడు భారత్‌లోని తన అమ్మమ్మ, తాతయ్యలను కలిసినట్లు ఇటీవల కమలా హారిస్ ట్విటర్‌లో వెల్లడించారు.
Amaravati News Navyandhra First Digital News Portal