Tirumala Darshans Cancelled: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. అక్టోబర్ 8వ తేదీన జరగనున్న గరుడసేవ కోసం అన్ని విభాగాల ఏర్పాట్లపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా గ్యాలరీలలోనికి ప్రవేశం, నిష్క్రమణ, హోల్డింగ్ పాయింట్లు, అన్నప్రసాద వితరణ, యాత్రికుల రద్దీ నిర్వహణ, పోలీసుల భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచడం, భక్తుల రవాణా, పార్కింగ్, బారికేడింగ్ తదితర అంశాలపై అదనపు ఈవో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించాు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, మెరుగైన సమాచారం కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం వయోవృద్ధులు దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేయడంతో పాటు, అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసిందని చెప్పారు. అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలో బైక్‌ల రాకపోకలను నిషేధించినట్లు తెలిపారు.
ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం పౌర్ణమి సందర్భంగా టీటీడీ మాదిరి గరుడ సేవను నిర్వహించింది. సాధారణంగా ప్రతి ఏడాదీ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సమీక్షించుకునేందులో భాగంగా టీటీడీ ఈ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ. రాత్రి 7 నుంచి9 గంటల నడుమ జరిగిన ఈ గరుడ సేవలో టీటీడీ ఈవో శ్యామల రావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మరియు సి వి ఎస్ ఓ శ్రీ శ్రీధర్ లతో కలిసి నాలుగు మాడవీధుల్లో భద్రత, తాగునీరు పంపిణీ, అన్నప్రసాద వితరణ, శ్రీవారి సేవకుల సేవలు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, ఇతర ఇంజినీరింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. కాగా శ్రీవారి గరుడ వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal