త్యాగానికి, సేవకు పోలీసులు ప్రతీక అని.. వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంతో పాటు సమాజానికి తోడ్పాటు అందించడంలో ముందుంటారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమాజంలో వారి సేవలు మరువలేనివని కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు విడిచిన పోలీసు అమరవీరులకు సీఎం నివాళులర్పించారు. గోషామహల్ పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు.
పోలీసుల త్యాగాలు మరవలేనివని.. కేఎస్ వ్యాస్, పరదేశి నాయుడు, ఉమేష్ చంద్ర వంటి అధికారుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో లా అండ్ ఆర్టర్ కీలకమని చెప్పారు. అలాంటి అతి ముఖ్యమైన లా అండ్ ఆర్డర్‌ను పోలీసు వ్యవస్థ కాపాడుతోందని సీఎం అభినందించారు. సైబర్ క్రైం ఛేదనలో తెలంగాణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకుందని గుర్తు చేశారు. తెలంగాణలో క్రైం రేటును నియంత్రించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా మార్చేందుకు గంజాయి, డ్రగ్స్ కట్టడికి టీజీ న్యాబ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఇక పోలీసుల సంక్షేమ నిధికి ప్రతి ఏడాది రూ. 20 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. విధుల్లో వీరమరణం పొందిన పోలీసుల కుటుంబాలకు పరిహారం విషయంపై కీలక ప్రకటన చేశారు. ఇకపై కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ స్థాయి పోలీసులు డ్యూటీలో ఉండగా వీరమరణం పొందితే రూ. కోటి పరిహారం ఇస్తామన్నారు. ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులకు రూ. 1.25 కోట్లు, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులకు రూ. 1.50 కోట్లు, ఐపీఎస్‌ల కుటుంబాలకు రూ. 2 కోట్లు పరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు. విధుల్లో శాశ్వాత అంగవైకల్యం పొందితే రూ. 50 లక్షలు, చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.