పేదలకు రేవంత్ సర్కారు తీపి కబురు… పది రోజుల్లోనే విధివిధానాలు ఖరారు

ఇల్లు లేని పేదలకు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలను సర్కారు వారం, పది రోజుల్లో ఖరారు చేయనున్నారని, ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. . అంతేకాదు, దీనిని కేంద్రం ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై అర్బన్‌, రూరల్‌) పథకానికి అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత.. డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పలు అంశాలపై ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించిన సంగతి తెలిసిందే.

వాటిలో ఇళ్లకోసం దాదాపు 82 లక్షలు దరఖాస్తు రాగా. పట్టణ పరిధిలో 23.5 లక్షలు, గ్రామీణంలో 58.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడత అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో.. సొంత స్థలం ఉన్నవారికి తొలి ప్రాధాన్యత.. రెండో విడతలో స్థలం లేనివారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని, స్థలం లేనివారికి చోటు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

ఈ హామీ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,16,500 ఇండ్లను కేటాయించాలని నిర్ణయించింది. రిజర్వ్‌ కోటా కింద మరో 33,500 ఇండ్లను ప్రభుత్వ విచక్షణలో ఉంచింది. ఇళ్ల నిర్మాణ పథకం అమలు కోసం బడ్జెట్‌లో రూ.9,184 కోట్లు కేటాయించగా, పీఎంఏవై పథకం కింద కేంద్రం నుంచి దాదాపు రూ.4,600 కోట్లు అందుతాయని అంచనా వేసింది.

ఇక, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇళ్ల నిర్మాణ పథకాల మార్గదర్శకాలు, విధివిధానాలపై గృహనిర్మాణ సంస్థ ఇప్పటికే అధ్యయనం చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అధికార బృందాలు పర్యటించి, ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్టు సమాచారం.

About amaravatinews

Check Also

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే…!

నకిలీ నోట్ల చలామణి విషయాన్ని కొందరు వ్యాపారులు రాచకొండ చౌటుప్పల్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. చౌటుప్పల్ సంస్థ నారాయణపూర్ ప్రాంతాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *