తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి తొలి విడత ఇంజనీరింగ్ (ఈఏపీసెట్ 2025) కౌన్సెలింగ్ రేపట్నుంచి (జులై 6) ప్రారంభంకానుంది. లో ఉండకపోవచ్చని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈఏపీసెట్‌లో ర్యాంకులు పొందిన విద్యార్ధులకు జులై 6 నుంచి వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభంకానుంది. మొత్తం 3 విడతల్లో కౌన్సెలింగ్ జరగనుంది. అయితే ఈసారి బీటెక్ సీట్ల సంఖ్య పెరిగే అవకాశమున్నా.. ఇప్పటి వరకు ఉన్నత విద్యా మండలి కొత్త సీట్లపై క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. కళాశాలలు, సీట్ల సంఖ్యపై ఇంకా ప్రకటన వెలువడలేదు. గతేడాది కన్వీనర్, బి కేటగిరీ కలిపి మొత్తం 175 కాలేజీల్లో 1,18,989 సీట్లు ఉన్నాయి.
ఈసారి పాలమూరు వర్సిటీ ప్రాంగణంలో, శాతవాహన వర్సిటీ పరిధిలోని హుస్నాబాద్‌లో కొత్త కళాశాలలు మంజూరైన సంగతి తెలిసిందే. వాటిల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కలుపుకొంటే కొత్తగా 528 సీట్లు అందుబాటులోకి వస్తాయి. దానికితోడు జేఎన్‌టీయూహెచ్.. ఏఐసీటీఈ నుంచి ఆమోదం పొందిన సీట్లు మరో 7 వేలు వరకు ఉన్నాయి. ప్రస్తుతం వీటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ కొత్త కాలేజీల్లో సీట్ల సంఖ్య తేలితే కౌన్సెలింగ్‌లో విద్యార్ధులు ఎంచుకోవడానికి అనుగుణంగా ఉంటుంది.
ఈ ఏడాది కొన్ని కాలేజీలు కోర్ బ్రాంచీల సీట్లు పెంచాలని ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకున్నాయి. కనీసం ఈ కోర్ బ్రాంచీల సీట్లకు అయినా అనుమతి ఇవ్వాలని యాజమన్యాలు కోరుతున్నాయి. మరో మూడు ఆఫ్ క్యాంపస్‌ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రేపట్నుంచి వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రారంభంకానున్న నేపథ్యంలో తొలి విడత కౌన్సెలింగ్‌లో కొత్త సీట్లను చేర్చే అవకాశం దాదాపు అసాధ్యం అంటున్నారు నిపుణులు. అయితే వెబ్ ఆప్షన్ల నమోదుకు జులై 15 వరకు అవకాశం ఉన్నందున కౌన్సెలింగ్ మధ్యలో కొత్త సీట్లను చేర్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌కు జులై 26, 27న వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. అప్పటికి వందల సంఖ్యలో సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.