గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇప్పటికే వందల ఇండ్లను నేలమట్టం చేశారు. కొందరు పేదల ఇండ్లతో పాటుగా బడాబాబుల ఖరీదైన విల్లాలను సైతం బుల్డోజర్ల సాయంతో కూల్చేశారు. అయితే ఈ కూల్చివేతలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల అమీన్‌పూర్, పటేల్‌గూడ ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టగా.. బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ సందర్భంగా హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ప్రతిపాదికన కూల్చివేతలు చేపడుతున్నారని ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చిన వెంటనే సామాన్లు కూడా తీసుకోనివ్వకుండా వెంటనే కూల్చివేతలు చేపట్టడంపై అమీన్‌పూర్ తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చార్మినార్ కూల్చమంటే కూల్చేస్తారా..? అంటూ హైడ్రా కమిననర్ రంగనాథ్‌పై సైతం తీవ్ర స్థాయిలో ఫైరయింది. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు నిర్ధారించకుండా వీకెండ్ డేస్‌లో కూల్చివేతలు ఏంటని నిలదీసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబ్ పరిధిలో ఉన్న అన్ని చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఓ సంస్థకు సర్వే పనులు అప్పగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ మెుత్తం పూర్తి కావటానికి దాదాపు 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. దీంతో మూడు నెలల పాటు హైడ్రా కూల్చివేతలు బ్రేక్ పడనుంది. చెరువులకు హద్దులు నిర్ణయించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో ఆక్రమణలు ఉంటే అప్పుడు కూల్చివేతలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందట.
 Amaravati News Navyandhra First Digital News Portal
Amaravati News Navyandhra First Digital News Portal
				 
		