మార్కెట్‌లోకి కొత్త వైరస్.. తెలంగాణ సర్కార్ అలెర్ట్.. హైదరాబాద్‌లో ఆస్పత్రులు సిద్ధం..!

Monkeypox alert: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే మానవాళి కోలుకుంటున్న నేపథ్యంలో.. మరో కొత్త వైరస్ (మంకీపాక్స్) వణికిస్తోంది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా ఈ కొత్త వైరస్ వ్యాపిస్తోంది. మిగతా దేశాలకు కూడా అంతేవేగంగా విస్తరిస్తోంది. ఈ మంకీపాక్స్ (ఎంపాక్స్‌)పై అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మంకీపాక్స్ వైరస్‌ మన దేశంలోకి రాకుండా అడ్డుకోవటమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ ప్రభుత్వం అలెర్టయింది.

ప్రపంచవ్యాప్తంగా అలజడి రేకెత్తిస్తున్న మంకీపాక్స్ కేసులపై తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఒకవేళ ఈ వైరస్ రాష్ట్రంలో ప్రవేశిస్తే.. వైద్యం అందించేందుకు సర్వం సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే.. గాంధీ ఆస్పత్రితో పాటు నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రిని కూడా వైద్యారోగ్య శాఖ రెడీ చేసింది. ఈ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసింది. గాంధీ ఆస్పత్రిలో 20 పడకలు కేటాయించగా.. ఇందులో పురుషులకు పది, మహిళలకు పది బెడ్లు ఏర్పాటు చేసినట్టు వైద్యులు తెలిపారు. ఫీవర్‌ ఆసుపత్రిలో 6 పడకలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు మన దేశంలోకి మంకీపాక్స్ ఎంటర్ కాకపోయినా.. అప్రమత్తంగా ఉండటం అవసరమని వైద్యులు చెప్తున్నారు.

అయితే.. ప్రస్తుతం కాంగో, నైజీరియా, కామెరూన్‌ దేశాల్లో ఎక్కువగా ఈ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. ఆ దేశాల నుంచి వచ్చే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అందుకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. హఠాత్తుగా జ్వరం రావడం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, కాళ్లుచేతులతో పాటు ముఖంపై దద్దుర్లు, దురద, చలి, తీవ్ర అలసట లాంటి లక్షణాలు ఉంటే.. వెంటనే అధికారులకు తెలియజేయటంతో పాటు.. ఆస్పత్రిలో చేరాలని సూచించారు. ఈ వైరస్.. రక్తం, శరీర ద్రవాలు, చర్మ గాయాలు, శ్వాసకోశ స్రావాల ద్వారా ఇతరులకు సోకుతుందని వైద్యులు పేర్కొన్నారు.

About amaravatinews

Check Also

అయ్యా..! యూరియా అంటే పట్టించుకోవట్లే.. కట్ చేస్తే ఇది సీన్..

వర్షాలు విస్తారంగా పడటంతో పంటలకు యూరియా డిమాండ్ పెరిగింది. కానీ సరఫరా సరిగ్గా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *