సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరిన మేడారంలో మినీ జాతర సందడి మొదలైంది.. ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.. మేడారంతో పాటు అనుబంధ గ్రామాలు, ఆలయాలలో ఆచార సాంప్రదాయ పూజ నిర్వహిస్తున్నారు.. మినీ జాతర విశిష్టత ఏంటి..? ఎలాంటి పూజలు నిర్వహిస్తారు.?
రెండేళ్లకోసారి మేడారం మహా జాతర నిర్వహించడం ఆనవాయితీ… కానీ క్రమక్రమంగా మినీ జాతర కూడా భక్తుల తాకిడి పెరుగుతూ వస్తుంది.. ఈ నేపథ్యంలోనే మినీ జాతర కూడా ప్రాశస్త్యంలోకి వచ్చింది.. ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీలలో నాలుగు రోజుల పాటు మినీ జాతర నిర్వహిస్తున్నారు.. ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి జాతర ప్రారంభించారు.. బుధవారం మేడారంతో పాటు, అనుబంధ గ్రామాలు, ఆలయాలలో ఊరుకట్టు నిర్వహిస్తారు.. ఆలయాలు శుద్ధిచేసి ఆదివాసి ఆచార సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు..
మేడారం గ్రామంలోని సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆదివాసీల వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, వివిధ రకాల ధాన్యం తీసుకొచ్చి వనదేవతలకు సమర్పిస్తారు.. నిర్వహించారు..అనంతరం ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. అదే సమయంలో కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయంలోనీ పూజారులు గద్దెల ప్రాంగణానికి చేరుకొని సాంప్రదాయ పూజలు, మొక్కులు చెల్లిస్తారు.. కొండాయిలోని గోవిందరాజు ఆలయంలో, పూనుగొండ్లని పగిడిద్దరాజు ఆలయంలో కూడా అదే సమయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అదేవిధంగా బయ్యక్కపేట లో సమ్మక్క పూజారులు ఆదివాసి ఆచార సాంప్రదాయ పూజ నిర్వహిస్తారు. మరోవైపు నాయకపోడు పూజారులుకూడా ఘట్టమ్మ గుట్ట ఆనవాయితీ ప్రకారం పూజలు నిర్వహిస్తారు… అదే సమయంలో పొలిమేర దేవతలకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.